హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నడిరోడ్డుపై జరిగిన పరువు హత్య సంచలనం సృష్టించింది. ఇష్టంలేకుండా పెళ్లిచేసుకున్నారన్న కక్షతో అమ్మాయి సోదరుడు.. నాగరాజు అనే యువకుడిని కిరాతకంగా చంపేశాడు. హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని వికారాబాద్ జిల్లా మర్పల్లిలో జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ విజయ్ సాంప్లా పరామర్శించారు.
ఈ సందర్భంగా విజయ్ సాంప్లా మీడియాతో మాట్లాడారు. నాగరాజు హత్యా ఘటన దురదృష్టకరమన్నారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. నాగరాజు కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటు కేసు విచారణ వేగవంతంగా జరిగేందుకు కృషి చేస్తామని విజయ్ సాప్లా హామీ ఇచ్చారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిగేలా చూస్తామని తెలిపారు.
‘నాగరాజు కుటుంబానికి రూ 8.50 లక్షల సాయం ఆర్థికసాయం అందిస్తున్నాం. తక్షణమే వారికి యాభైశాతం అందజేస్తాం. వారికి మూడెకరాల భూమి కేటాయిస్తాం. అలాగే రెండు పడక గదులు ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తాం. నాగరాజు భార్య సయ్యద్ ఆశ్రిన్ సుల్తానాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం.’ అని విజయ్ సాప్లా హామీ ఇచ్చారు.
నాగరాజు కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రెండు విడతల్లో రూ.8.25 లక్షలు ఆర్ధిక సాయం అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. మొదటి విడత కింద రూ.4.125 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబంలో ఒకరికి రూ.5 వేల పెన్షన్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆయన వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ తదితరులు ఉన్నారు.