‘వారిసు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ గురించి ఓ విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. విజయ్.. తన భార్య సంగీతతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విజయ్, సంగీతలకు వివాహమై 23 ఏళ్లు అవుతోంది. వీరికి కొడుకు జేసన్, కూతురు దివ్య ఉన్నారు.
ఇంతకీ ఈ రూమర్ ఎలా మొదలైందంటే.. విజయ్‌కి సంబంధించిన వికిపీడియా పేజీలో వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు రాసుందట. అంతేకాదు విజయ్ నటించిన ‘వారిసు’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి సంగీత రాకపోవడం, ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ భార్య ప్రియ సీమంతం వేడుకకు కూడా విజయ్‌తో పాటు సంగీత రాకపోవడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది.
అయితే సంగీత ప్రస్తుతం పిల్లలతో కలిసి అమెరికాలో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారని, అందుకే విజయ్‌తో కలిసి ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకాలేకపోతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. వారిసు ప్రొమోషన్స్‌లో భాగంగా విజయ్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లలేకపోయారని, సినిమా విడుదల కాగానే బ్రేక్ తీసుకుని భార్య, పిల్లల వద్దకు వెళ్తారని కోలీవుడ్ టాక్.
ఇప్పటికే కోలీవుడ్‌లో ధనుష్, ఐశ్వర్య దంపతుల విడాకుల విషయం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రొఫెషనల్‌గా ఒకరికొకరు ఎంతో సపోర్ట్ ఇచ్చుకునే వారిద్దరూ ఇలా విడాకుల వరకు వెళ్లడం అత్యంత బాధాకరం అని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. అయితే తాము విడాకులు తీసుకోబోతున్నట్లు ఇద్దరూ సోషల్ మీడియాలో అధికారికంగా వెల్లడించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు సర్దుకున్నాయని, విడాకులు తీసుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీని గురించి మాత్రం వారు ఇప్పటివరకు స్పందించలేదు.