మహర్షి సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి, ఎట్టకేలకు విజయ్ హీరోగా ఓ పెద్ద సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి హాట్ హాట్ అప్ డేట్ వచ్చింది. విజయ్ తో వంశీ పైడిపల్లి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు తీశాడు వంశీ పైడిపల్లి. ఈ సందర్భంగా విజయ్ తో వంశీ దిగిన ఫొటో వైరల్ అయింది.
విజయ్ సినిమాలో తారాగణం ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో కూడా భారీ స్టార్ కాస్ట్ నటిస్తోంది. ఇందులో హీరోయిన్ గా రష్మికను తీసుకున్నారు. ఇతర కీలక పాత్రల్లో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కిక్ శ్యామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు నటిస్తున్నారు. వీళ్లలో చాలామంది ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నారు. దీంతో షూటింగ్ స్పాట్ మొత్తం పండగ వాతావరణం కనిపించింది.
మాస్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మెసేజ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వంశీ పైడిపల్లి. వంశీతో పాటు అహితోష్ సాల్మన్, హరి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు. కోలీవుడ్ లో తమన్ కు ఇది చాలా పెద్ద ఆఫర్.
దిల్ రాజు, పీవీపీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి ఎట్రాక్షన్ గా ఈ సినిమా రాబోతోంది. విజయ్ నటిస్తున్న తొలి తెలుగు స్ట్రయిట్ మూవీ ఇది.