ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి సినిమాల సందడి షురూ అయింది. అయితే ఈ సారి ఏకంగా మూడు పెద్ద సినిమాలు బరిలోకి దిడుగుతుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ మూడు సినిమాల్లో విజయం ఎవరిని వరిస్తుంది? అనే కోణంలో చర్చలు షురూ అయ్యాయి.బాలకృష్ణ హీరోగా రూపొందిన మాస్ మసాలా సినిమా ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న విడుదల కాబోతోంది. అలాగే మెగా మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాం అంటూ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో జనవరి 13న రంగంలోకి దిగుతున్నారు. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం గమనార్హం.
అయితే ఇదే సమయంలో తమిళ స్టార్ విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా రిలీజ్ కానుండటం విశేషం. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను జనవరి 11న రిలీజ్ చేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే సంక్రాంతి సీజన్ లో, అది కూడా చిరంజీవి బాలయ్య లాంటి స్టార్స్ బరిలో ఉండగా వారసుడు సినిమా రిలీజ్ అనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది.
ఈ పరిస్థితుల నడుమ తాజాగా వారసుడు సినిమా వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు అధికారికంగా ప్రకటించారు. తాజా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ చిరంజీవి, బాలకృష్ణ సినిమా తర్వాతే మా వారసుడు అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో జనవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.ఇదే వారసుడు సినిమాను తమిళంలో వారిసు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే తమిళంలో మాత్రం జనవరి 11న రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు చెప్పారు. సంక్రాంతికి మన తెలుగు హీరోలైన బాలయ్య, చిరంజీవిలకు ఎక్కువ థియేటర్లకు దొరకాలని, వారి సినిమాలు పెద్ద ఎత్తున రిలీజ్ కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు పేర్కొన్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ వారసుడు చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పేరుకు డబ్బింగ్ సినిమానే అయినా.. తెలుగు స్ట్రేయిట్ సినిమా రేంజ్‌లో థియేటర్‌లలో సందడి చేయడానికి రెడీ అయింది.విజయ్ 66వ మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు. శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం అందించారు.వారసుడు సినిమాలో విజయ్ పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.అతడు, బృందావనం తరహా స్టోరీ లైన్ తో ఈ సినిమా రూపొందిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికర అంశం.