విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టైరిన్ అనే విషవాయువు లీక్ అవడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందలు, వేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించేందుకు అమరావతి నుంచి విశాఖకు వెళ్లారు.
అయితే తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరేటప్పుడు వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ముఖ్యమంత్రి కారులో ఎక్కారు. విజయసాయిరెడ్డి కారులో ఎక్కి కూర్చున్న కొద్ది క్షణాల్లోనే ఆయనను కిందికి దిగాల్సిందిగా సీఎం జగన్ సూచించారు. దీంతో చేసేదేమీ లేక విజయసాయిరెడ్డి కారు నుంచి కిందికి దిగారు. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.మీ అవసరం లేదని దించేసారని, జగన్ కు, విజయసాయి రెడ్డి కి పడట్లేదని చర్చించుకుంటున్నారు.
అయితే విజయసాయిరెడ్డిని కారు నుంచి దింపేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిని కారులో తన వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహించాలన్నా, బాధితులకు సరైన వైద్య సాయం అందాలన్నా ఆరోగ్యశాఖ మంత్రి ముఖ్యం కాబట్టి ఆయనను సీఎం జగన్ తన వెంట తీసుకెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఆరోగ్య శాఖ మంత్రిని ఎక్కించుకున్నా, విజయసాయి రెడ్డి ని కూడా దింపెయ్యాల్సిన అవసరం ఏముందని చర్చిస్తున్నారు.