బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ముఖ్య నేతలంతా హెచ్ఐసీసీ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. ఇవాళ్టి భేటీలో పలు కీలక అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గుజరాత్ ఎన్నికల ప్రిపరేషన్ పై మాట్లాడిన ప్రధాని మోడీ నేతలకు పలు సూచనలు చేశారు.
నాయకులు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండాలని, సమస్యలు తెలుసుకుని అండగా నిలవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులకు సూచించారు మోడీ. ఎంపీలు తమ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోనే అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించాలన్నారు. చుట్టుపక్కల నియోజకవర్గాల్లో పార్టీ ఎంపీ లేకపోతే అక్కడ కూడా పర్యటించాలన్నారు.
మరోవైపు కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. పది లక్షల మందితో భారీ ఎత్తున ఈ సభను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బహిరంగ సభాస్థలి వద్ద 3 వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు 18 మందికి ఒక వేదిక, రాష్ట్ర, జాతీయ స్థాయి పదాధికారులకు మరో వేదికను సిద్ధం చేశారు. ప్రముఖులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
విజయ సంకల్ప సభను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జన సమీకరణ చేశారు. 18 ట్రైన్స్ తో పాటు వందలాది ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలను వారికోసం ఏర్పాటు చేశారు. ఇటు ప్రధాని మోడీ బహిరంగ సభకు సాయంత్రం 5.55 గంటలకు హెచ్ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. బేగంపేట విమానాశ్రయానికి సా.6.15 గంటలకు చేరుకుంటారు. అక్కడ్నుంచి బయల్దేరి సభాస్థలికి సా.6.30 గంటలకు వస్తారు. రా.7.30 గంటల వరకు సుమారు గంటపాటు ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.