లాక్ డౌన్ తరువాత ఇండియాలో కూడా వెబ్ సిరీస్ కల్చర్ బాగా అలవాటు అయ్యింది. దీంతో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది స్టార్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఇది తెరకెక్కింది.
బాలీవుడ్ డైరెక్టర్స్ కరణ్ అన్షమాన్, సువర్ణ్ వర్మ ఈ సిరీస్ ని డైరెక్ట్ చేయగా బసుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, గౌరవ్ చోప్రా, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 10 నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న వెంకటేష్ నటించడంతో ఈ సిరీస్ ని చూడడానికి చాలా మంది ఆసక్తి చూపించారు.
కానీ ఈ సిరీస్ వెంకటేష్ ఇమేజ్ కి పూర్తి విరుద్దంగా ఉంది. పక్కా అడల్ట్ కంటెంట్ తో రానా నాయుడు తెరకెక్కడంతో టాలీవుడ్ లో ఈ సిరీస్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రానా నాయుడు ఒక బ్లూ ఫిలిం అంటూ పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయం పై లేడీ మెగాస్టార్ విజయశాంతి కూడా స్పందించింది.
”ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (రానా నాయుడు) ఓటిటి సిరీస్ పూర్తి మహిళా వ్యతిరేకతతో తెరకెక్కింది. ఈ విషయం గురించి ఇప్పటికే అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని సంబంధిత నిర్మాతలు ఓటిటి నుండి తొలిగించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్‌లో కూడా దేశవ్యాప్తంగా ఎప్పుడైనా ఇటువంటి ప్రసారాలు, ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే అయ్యేలా చిత్రాలు తెరకెక్కించకుండా సెన్సార్ బోర్డు చర్యలు తీసుకోవాలి. నటులుగా మనకి ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, ప్రేమని, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా” అంటూ వెల్లడించింది.