మామూలుగు సినీఇండస్ట్రీలో ఒక కథ మంచి హిట్ కొట్టగానే దానికి సీక్వెల్ గా మరో సినిమా తెరకెక్కుతుంటాయి. తాజాగా అదే రూట్ ను ఎంచుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన ఎఫ్ 2 మంచి హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాకు సెక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కించనున్నాడట దర్శకుడు అనిల్. ఇప్పటికే ఎఫ్ 3 కి సంబంధించి కథను కూడా అనిల్ సిద్ధం చేసుకున్నారని సమాచారం.
ప్రస్తుతం వెంకటేష్ అసురన్ రీమేక్ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్ కూడా వేరొక సినిమాలతో బిజీ గా ఉండటం వల్ల అనిల్ ఎదురుచూస్తున్నాడట. ఇక ఆ ఇద్దరు ఫ్రీ అయితే ఎఫ్ 3 పట్టాలెక్కించేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడట దర్శకుడు. మరోవైపు ఎఫ్ 3 లో వెంకటేష్, వరుణ్ తో పాటు రవితేజ ని కూడా పెట్టాలని దిల్ రాజు భావిస్తున్నాడట. అంతే కాకుండా లేడీ అమితాబ్ విజయశాంతిని కూడా ఎఫ్ 3 లో తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందట. మాములుగా వెంకటేష్, వరుణ్ లు గత సంక్రాంతికి కడుపుబ్బా నవ్వించారు. ఇప్పుడు వారికి రవితేజ తోడైతే మాములుగా ఉండదంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి మహేష్ బాబు హీరోగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీ బిజీ గా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందు రానుంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం విజయశాంతి మేకప్ వేసుకోవటం విశేషం.