దళిత బంధు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈమధ్యే సీఎం కేసీఆర్ దేశమంతా దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకుంటుందా? అని ఖమ్మం సభలో నిలదీశారు. అయితే.. రాష్ట్రంలో పథకం అమలుపై బీజేపీ వర్గాలు విమర్శల దాడిని కొనసాగిస్తున్నాయి. తాజాగా బీజేపీ నేత విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సోషల్ మీడియాలో ఓ పేపర్ కటింగ్ ను పోస్ట్ చేసిన విజయశాంతి.. తెలంగాణలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి ఎదిగిన కేసీఆర్ సర్కార్ సాధించిన ఘనతకు నిదర్శనం ఈ కథనమని చెప్పారు. దేశం మొత్తాన్ని ఉద్ధరించేస్తామంటూ డబ్బా కొట్టుకుంటున్న ఆయన.. కేవలం ఎన్నికల ప్రయోజనం కోసమే తెలంగాణలో ప్రవేశపెట్టిన దళిత బంధులోని డొల్లతనాన్ని మీడియా బట్టబయలు చేసిందని తెలిపారు.
బడ్జెట్ లో మాత్రం రూ.17,700 కోట్లు కేటాయించి.. గత 10 నెలల్లో రూపాయి కూడా తీయలేదన్నారు విజయశాంతి. ఒక్కరికి కూడా ఈ పథకం అమలు కాలేదని.. ఇది చాలక.. బీఆర్ఎస్ కి పగ్గాలిస్తే దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తామంటూ దొంగ హామీలిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా దళితులను మభ్యపెట్టడం, మోసపుచ్చడం కాక ఇంకేంటని అడిగారు.
కేసీఆర్ సర్కార్ ఊదరగొడుతున్న దళిత బంధు, రైతుబంధు చివరికి బంద్ అవుతాయని తాను ముందునుంచి చెబుతూనే ఉన్నానని చెప్పారు. చివరికి ఆదే జరుగుతోందని తెలిపారు విజయశాంతి.