ఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్ రీటెండర్ల వ్యవహారం కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య అగ్గి రాజేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధానమంత్రి అనుమతితోనే బిపిఎల్ రద్దు పోలవరంపై టెండర్లు రద్దు చేశామని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. పోలవరం రీటెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల కేంద్రం మొదటి నుంచి అసంతృప్తిగానే ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దీనిపై తనకు పూర్తి వివరాలు అందివ్వాలని అధికారులను ఆదేశించారు. దానికితోడు తాజాగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లు పీఎంఓకు తీవ్ర ఆగ్రహం కలిగించాయని చెబుతున్నారు. దీనిపై వివరణ ఇవ్వడానికి విజయసాయిరెడ్డి హుటాహుటిన బయల్దేరి పీఎంవోకు వెళ్లారు. విజయసాయిరెడ్డిని అసలు పీఎంవో అధికారులే పిలిపించారని తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో ప్రధానమంత్రి ప్రస్తావన ఎందుకు తీసుకువచ్చారని విజయసాయిని వారు ప్రశ్నించారని అంటున్నారు. తను చేసిన వ్యాఖ్యలపై విజయసాయి వారికి వివరణ ఇచ్చినట్టు సమాచారం. విజయసాయి వెంట రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం రెడ్డి కూడా పిఎంఓకు వెళ్లారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు అంశాలపై వారు చర్చించారు. గత ప్రభుత్వం ఈ రెండింటిలో భారీఎత్తున అవినీతికి పాల్పడిందని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పటికే పోలవరం హైడల్ ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ వద్దని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో వీరిద్దరూ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున పిఎంఓ అధికారులకు పూర్వాపరాలను, టెండర్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించినట్టు తెలుస్తోంది. పోలవరంపై రివర్స్ టెండరింగ్‌కు అనుమతులుఇవ్వాలని చివరిగా వారు పీఎంవోను కోరినట్టు సమాచారం.