రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథలు ఎంత బలంగా ఉంటాయో మనకు తెలుసు. కానీ.. ఆయన్ను తలదన్నేలా కథలు అల్లేస్తున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మొన్న రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కొందరు మీడియా ప్రముఖులతో భేటీ అయ్యారు. అయితే.. బోడిగుండు మోకాలికి ముడిపెట్టినట్టు విజయసాయి ఓ విచిత్రమైన ట్వీట్ చేశారు. ఈ భేటీ చంద్రబాబు కోసమే అని ఆరోపిస్తూ మోడీ జపం చేశారు.
అర్థం పర్థం లేని ఈ ట్వీట్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరైతే కామెడీలు చాలు అంటూ పగలబడి నవ్వుతున్నారు. అక్కడ జరిగింది సీక్రెట్ మీటింగ్ కాదని విజయసాయిని ఎటాక్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే.. రాహుల్ ను ప్రముఖులు కలిసిన సమయంలో మీడియా అక్కడే ఉంది. కెమెరాలు, ఫోటోలు వెంటనే బయటకొచ్చాయి. దానికే.. విజయసాయి ఇదేదో సీక్రెట్ మీటింగ్ అన్నట్లు ట్వీట్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు.
ఈ ట్వీట్ పై కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పందించారు. 22 కేసుల్లో నిందితుడైన విజయసాయికి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. రాహుల్ ప్రజాస్వామ్య బద్ధంగానే మీడియా, ఇతర ప్రముఖుల్ని కలిశారని అన్నారు. అయినా.. అర్ధరాత్రి సమావేశాలు నిర్వహించే వారికి, అవినీతి పరులకే రాహుల్ సమావేశాల్లో కుట్ర కనిపిస్తుందని ఎద్దేవ చేశారు.
మాణిక్కం ఠాగూర్ పోస్ట్ ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు.. విజయసాయిని ఓ ఆటాడుకుంటున్నారు. ఇదంతా మోడీని ప్రసన్నం చేసుకునేందుకేనని మండిపడుతున్నారు. జాబ్ మేళా పేరుతో ఏపీలో మీరు చేస్తున్న గారడీ చూస్తూనే ఉన్నామని సెటైర్లు వేస్తున్నారు. మోడీకి బాకా ఊదకపోతే బయట ఉండలేరని.. అందుకే ఇలాంటి విచిత్ర ట్వీట్లు చేస్తున్నారని అంటున్నారు. మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.