రైతు సమస్యలపై టీఆర్ఎస్ సర్కార్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు బీజేపీ నేత విజయశాంతి. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామన్న కేసీఆర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది రైతులకు రూ.25 వేలు మాత్రమే చేశారన్నారు. దీనివల్ల బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వకపోవడమే కాకుండా.. ఉన్న రుణానికి వడ్డీ కట్టించుకుంటూ రెన్యూవల్ చేస్తున్నాయని చెప్పారు. రుణమాఫీ కోసం రైతన్నలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికలను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ ఇదిగో రుణమాఫీ, అదిగో రుణమాఫీ అంటూ ఓట్లు దండుకుందని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టి గెలిచారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనైనా రుణ విముక్తి కలుగుతుందని భావించిన రైతులకు ప్రభుత్వం కన్నీళ్లే మిగిల్చిందని మండిపడ్డారు. ఆగస్టు 1న జరిగిన కేబినెట్ మీటింగ్ లో రైతు రుణమాఫీకి రూ.2,006 కోట్లు అవసరమని ప్రతిపాదన చేసి… స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా రూ.50 వేల లోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ఆగస్టు 16 నుంచి 31లోపు వేస్తామని ఆశ పెట్టి… 26 వరకు కొంతమంది రైతులకు మాత్రమే డబ్బు వేశారని వివరించారు. 26 తర్వాత 4.97 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.1682 కోట్లలో ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు.
రెండేళ్లుగా అధిక వర్షాలతో పత్తి, మినుము, వరి పంటలు దెబ్బతిన్నాయన్న విజయశాంతి.. రుణమాఫీ కాక, రాయితీ విత్తనాలు దొరకక రైతులు అప్పుల బాధతో ఉరితాడుకు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోనుందా..? అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిలో కలుగుతోందన్నారు. రుణమాఫీ చేయాల్సిన డబ్బును హుజూరాబాద్ ఎన్నిక కోసం దళిత బందు పథకానికి తరలించడం కరెక్ట్ కాదని చెప్పారు. ఇప్పటికైనా యావత్ తెలంగాణ రైతులు ఆలోచించాలని.. టీఆర్ఎస్ సర్కార్ ఆడుతున్న కపట నాటకాన్ని గమనించాలన్నారు. రానున్న రోజుల్లో గులాబీ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు విజయశాంతి.