వచ్చే పదేళ్లలో తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా, అయోమయంగా ఉన్నాయని అంటున్నారు విజయశాంతి. అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి తానే సీఎంగా కొనసాగుతానని కేసీఆర్ చెప్పడం వెనుక అసలు గుట్టు వేరే ఉందని టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారని ఆమె చెబుతున్నారు.
హైదరాబాద్: గులాబీ పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని కట్టడి చేయడంతో పాటు మేనల్లుడు హరీశ్‌రావును సంతృప్తి పరచడం కోసమే కేసీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేశారనే వార్తలు వస్తున్నాయని విజయశాంతి చెప్పారు. ‘హరీశ్‌రావుకు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఆయన అంతరాల్లో కేటీఆర్ తనకు పోటీగా మారారని భావిస్తున్నారు. ఆ కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో అనూహ్యంగా ఈ ప్రకటన చేశారనే వాదన కూడా ఉంది. అసమ్మతి ఎమ్మెల్యేలకు ఎన్ని చెప్పినప్పటికీ బీజేపీ ఎంపీ అరవింద్ కుమార్‌ను ఎమ్మెల్యే షకీల్ కలవడం, ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ బాస్‌ను ఆత్మరక్షణలో పడేసినట్లు తెలుస్తోంది. ఒక్క ఎమ్మెల్యేతో మొదలైన ధిక్కారస్వరం మిగిలిన ఎమ్మెల్యేలకు వ్యాపించకుండా ఉండేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వచ్చే పదేళ్లు కూడా తానే సీఎం అని చెప్పుకొని ఉండవచ్చు. జీవితాంతం తాను ముఖ్యమంత్రిగా ఉండాలని కేసీఆర్ కోరుకోవచ్చేమో కానీ తెలంగాణ ప్రజలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మళ్లీ అలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు..’ అని విజయశాంతి వ్యాఖ్యానించారు.