మల్లన్న సాగర్ నిర్వాసితుల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. రిజర్వాయర్ ను ఈ నెల 23న కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని.. నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అధికారుల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన కుటుంబాలు.. ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన అధికారులు.. తరువాత వారిని గాలికొదిలేశారని మండిపడ్డారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయన్నారు. రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ తరలించారని.. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా 8 నెలల క్రితం చివరిగా బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామస్తులను పంపారని గుర్తు చేశారు.
ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించగా.. మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారన్నారు విజయశాంతి. దాదాపు ఏడాది కావస్తున్నా 3,500 కుటుంబాలకు అటు డబుల్ బెడ్రూం ఇండ్లను గానీ, ఇటు ఓపెన్ ప్లాట్లను గానీ ఇవ్వలేదని ఆరోపించారు. నిర్వాసితులు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ ఆవేదనతో ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.
ఇద్దరు ఆడ పిల్లలున్న రాజబాబు అనే నిర్వాసితుడు ఏడాది క్రితం ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మరణించాడని… ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు బాలవ్వ ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఆశలపై నీళ్లు జల్లిన ఈ పాలక రాబందుల కారణంగా ఊరికాని ఊరిలో తనువు చాలించిన అభాగ్యుల ఉసురు ఊరికనే పోదని శాపనార్ధాలు పెట్టారు. ప్లాట్ల దందాల కోసం నిర్వాసితులకు వారి గ్రామాలతో శాశ్వతంగా బంధాల్ని తెంచేస్తున్న దౌర్భాగ్యులకు పుట్టగతులు ఉండవని విమర్శలు చేశారు విజయశాంతి.