విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి సమస్యలు చెబుతుండటం సంతోషంగా ఉంది. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా సంజయ్ పాదయాత్ర చేస్తూ బండి ముందుకు వెళుతుంటే.. కేసీఆర్ కారు వెనక్కుపోతోంది. టీఆర్ఎస్ నేతలు పాదయాత్రను విమర్శించడం సిగ్గు చేటు. కేసీఆర్ ఎలాగూ తిరగరు. ఫాంహౌస్ కే పరిమితం. కనీసం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తున్న బండిని అభినందించడం పోయి విమర్శిస్తారా..?
కేసీఆర్ ను ప్రశ్నిస్తే తట్టుకోలేరు. జైల్లో పెడతారు. కేసులు పెడతారు. తెలంగాణ ప్రజల హక్కుల రెక్కలను కేసీఆర్ విరిచేస్తున్నారు. బీజేపీ చేపట్టిన పాదయాత్రతో ప్రజల్లో ఆశలు మొదలయ్యాయి. బీజేపీ అండగా ఉందని వస్తున్నారు. మహిళలకు శిక్షణ, ఉపాధి కోసం కేంద్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. శిక్షణా కాలంలో రూ.7,500లు వేతనం అందిస్తున్న ఘనత కేంద్రానిదే. మహిళా ఉత్పత్తులను కూడా మార్కెటింగ్ చేస్తూ ప్రోత్సహిస్తోంది. కాన్పు సహా శిశువులకు అవసరమైన సాయాన్ని కేంద్రమే చేస్తోంది.
యువత ఉపాధి కోసం కేంద్రం ప్రత్యేక నిధులిస్తోంది. చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఆర్థిక సాయం చేస్తోంది. పేదలకు స్థలం ఉంటే ఇల్లు కూడా నిర్మిస్తున్న ఘనత కేంద్రానిదే. రోగమొస్తే ప్రతీ ఒక్కరికీ చికిత్స కోసం రూ.5 లక్షల వరకు వ్యయాన్ని కేంద్రమే భరించేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోంది. కానీ.. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని పక్కనపెట్టి పేదల ఉసురు తీస్తోం. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ సహా అన్ని హామీలను గాలికొదిలేసిన కేసీఆర్ ను ఎందుకు ఉపేక్షించాలి..? తెలంగాణ ఉద్యమంలో 1400 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఆ కుటుంబాలకు ఏం చేశారు.
కేసీఆర్ కు త్యాగాలు చేసిన వారికంటే… డబ్బులిచ్చే వాళ్లపైనే మక్కువ ఎక్కువ. నీళ్లలోనుండి నిధులు… నిధుల్లో నుండి కుటుంబాలకు నియామకాలిస్తూ సంబురం చేసుకుంటున్నారు. ఏడేళ్లయింది… ఇంకెప్పుడిస్తారు ఉద్యోగాలు..? వయసు మీద పడ్డాక ఉద్యోగాలెవరిస్తారు..? యువకులారా మీలో పౌరుషం లేదా..? రోశం లేదా..? ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు..? కేసీఆర్ కు భయపడుతున్నారా..? ఎక్కడకు పోయింది మీ పౌరుషం..? పక్కోడు మోసం చేస్తేనే ఉద్యమించారుగా.. మనోడు దగా చేస్తే పాతరేయకుండా ఏం చేస్తున్నారు..?
Advertisements
ఆత్మహత్యలు పరిష్కారం కాదు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమించాలి. కేసీఆర్ పై తిరగబడాలి. యువత, రైతులు తల్చుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయి. ఉద్యమించేందుకు యువత ముందుకు రావాలి. బ్యూటిఫుల్ తెలంగాణ.. నేడు బూతుల, తాగుడు తెలంగాణగా మారింది. నేటి యువతను తాగుబోతులను చేసి పడుకోబెడుతూ భవిష్యత్ ను నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా మించేందేమీ లేదు. కేసీఆర్ పై తిరగబడండి. బీజేపీ జెండాను రెపరెపలాడించండి.