నిజామాబాద్ జిల్లా భోధన్ వేదికగా.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎడపల్లిలో నిర్వహించిన రైతు సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సదస్సు ద్వారా రైతులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2014 నుంచి ధాన్యం కొనుగోలుపై లేని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది..? అని ఆమె ప్రశ్నించారు. కేంద్రానికి బాయిల్డ్ రైస్ ఇవ్వనని లెటర్ ఇచ్చిన మాట నిజం కాదా కేసీఆర్ చెప్పాలన్నారు.
కేసీఆర్ రైతులను అడ్డు పెట్టుకొని వడ్ల కొనుగోలు విషయం తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే, రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని రాములమ్మ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదన్నారు. రైతులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, రైతులు మేలుకోవాలన్నారు.
రూ.2 లక్షల కోట్లు దోచుకున్న కేసీఆర్.. ఇంకా దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. ఉచిత విద్యుత్ అంటూనే సర్వీస్ ఛార్జి ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండలేదని హెచ్చరించారు.
తెలంగాణలో హుజురాబాద్ ఓటమీ, 4 రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని విజయశాంతి అన్నారు. తన పీఠం కదులుతోందన్న భయంతోనే.. కేసీఆర్ వడ్లను సమస్యగా మార్చారని ధ్వజమెత్తారు. రైతులను అడ్డం పెట్టుకుని బీజేపీపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ దళారులు కలిసి రైతులకు మేలు చేసే రైతు చట్టాలను అడ్డుకున్నారన్నారు. ఎప్పటికైనా బీజేపీ, ప్రధాని మోడీ రైతుకు అండగా ఉంటుందన్నారు.