ప్రభుత్వ అనాలోచిత తీరును తట్టుకోలేక రాష్ట్రవ్యాప్తంగా 9మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు బీజేపీ నేత విజయశాంతి. అయినా కూడా బదిలీలు మాత్రం ఆగవద్దంటూ సీఎం బలవంతంగా అధికారులకు హుకుం జారీ చేసి, ఉద్యోగులను అష్టకష్టాల పాలుచేస్తూ వారి ఉసురు తీస్తున్నరని మండిపడ్డారు. ఈ దుర్మార్గపు నియంత పాలనను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం అంతమొందించడం ఖాయమని హెచ్చరించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తమకు ఆప్షన్ ప్రకారం బదిలీ చేయండని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్న పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు విజయశాంతి. కేసీఆర్ ఏడున్నరేళ్ల పాలనలో తమ కనీస డిమాండ్లను కూడా తీర్చటం లేదనే ఆగ్రహంతో వారంతా ఉన్నారని చెప్పారు. 317 జీవో అనే పంజాలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చిక్కుకుని విలవిలాడుతున్న దుస్థితి రావడం అత్యంత హేయమని ఆవేదన వ్యక్తం చేశారు.
బదిలీల కోసం ఉద్యోగులు పెట్టుకున్న ఆప్షన్లు, ఉద్యోగ సంఘాల ఆలోచనలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఇష్టం వచ్చిన రీతిలో చేపడుతోందని విమర్శించారు విజయశాంతి. ఉద్యోగుల్లో సీనియర్, జూనియర్ అనే చీలిక తేవడమే కాకుండా భర్తను ఓ జిల్లాకు, భార్యను మరో జిల్లాకు బదిలీ చేస్తూ ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్ణయాలతో విసిగిపోయి.. ఏం చేయాలో పాలుపోక కేసీఆర్ సర్కార్ పై ప్రత్యక్ష ఉద్యమానికి పూనుకుని ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ను ముట్టడిస్తున్నారని అన్నారు విజయశాంతి. తమ గోడును, ఆవేదనను తెలిపేందుకు అలా ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకొని, లాఠీలకు పనిచెబుతూ వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.