తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీ… ప్రాణం లేని మనిషిని బతికించడం..రెండూ ఒకటే అని జనానికి బాగా అర్థమైందని ఎద్దేవా చేశారు 50 వేల కొలువుల భర్తీ అంటూ నెలలకు నెలలు గడిపేస్తున్నారే తప్ప వాటిని భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ఆలోచన ఈ సర్కారుకు లేనే లేదంటూ మండిపడ్డారు. లెక్కలు తీస్తే దాదాపు లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయన్న ఆమె.. 65 వేల ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చి చెప్పినా లెక్కలు అసమగ్రంగా ఉన్నాయని నివేదికల్ని పక్కన పడేశారని విమర్శించారు. సరైన లెక్కలు తీసి నిరుద్యోగులకు న్యాయం చెయ్యాలనే ఆలోచన లేదని ఫైర్ అయ్యారు.
గతంలో కమల్ నాథన్ కమిషన్ పేరు చెబుతూ ఉద్యోగాల భర్తీకి కాలయాపన చేసిన ఈ సర్కారు… ఇప్పుడు ఖాళీలపై సరైన వివరాల్లేవంటూ కాలం గడిపేస్తోందని ఆరోపించారు విజయశాంతి. కనీసం కేసీఆరే స్వయంగా ప్రకటించిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీకి కూడా ముందడుగు వెయ్యలేని సర్కారు చేతగానితనం చూసి యావత్ తెలంగాణ సిగ్గుపడుతోందని చురకలంటించారు.
గతేడాది డిసెంబర్‌లో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా ఆయన మాట మీద నమ్మకం లేక పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు చేసుకున్నారని గుర్తు చేశారు. ఉద్యోగాల సంగతి అటుంచి, నిరుద్యోగ భృతి అన్నారని చివరికి ఆ హామీని కూడా తుంగలో తొక్కేసారని మండిపడ్డారు విజయశాంతి. సర్కార్ అసమర్థత కారణంగా చాలామంది నిరుద్యోగులకు ఏజ్ బార్ అయిపోయి ఎన్నో పోస్టులకు అనర్హులు అయ్యారని.. ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనో.. ఎక్కడైనా ఎన్నికల మాట వినిపిస్తే తప్ప మళ్లీ కేసీఆర్ నోట ఉద్యోగాల మాట వినిపించదేమోనని విమర్శించారు విజయశాంతి.