తెలుగు రాష్ట్రాల్లో జుగుప్స కలిగించే దారుణాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు బీజేపీ నేత విజయశాంతి. కామంతో కళ్లు మూసుకుపోయిన పాపాత్ములకు పసి పిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రతీ దానికి ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని మాత్రమే వేలెత్తి చూపడం వల్ల లాభం లేదన్నారు. వ్యక్తిగా మనమేం చేస్తున్నాం? ఇంట్లోని ఆడపిల్లకు అండగా నిలిచేలా అబ్బాయిలను మలుచుకుంటున్నామా? అని ప్రశ్నించారు.
ఇటీవలి కాలంలో విద్యార్థి లోకం, యువతరం డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకున్నాయని అన్నారు విజయశాంతి. హైస్కూల్ స్థాయిలో సైతం పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం, గంజాయితో పార్టీలు చేసుకోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవిగాక బైక్ రేస్ లు, బెట్టింగులు కూడా ఉన్నాయని చెప్పారు. సిగ్గుపడేలా.. తలదించుకునేలా సంచలన ఘటనలు జరిగినప్పుడల్లా కొన్ని రోజుల పాటు ర్యాలీలు, నిరసనలు చేసి ఆయాసంతో ఆగిపోవడం తప్ప.. ఒక స్థిర సంకల్పంతో ఎంత మేరకు మనం విమెన్ ఫ్రెండ్లీ సమాజాన్ని నిర్మించుకున్నామన్నారు.
సమాజంలో ఈ తీరు మారే వరకూ స్త్రీల ఉద్ధరణ పేరిట ఎన్ని పథకాలు పెట్టినా… ఒరిగేదేమీ ఉండదని చెప్పారు విజయశాంతి. ఇంట్లో మొదలుపెట్టి స్కూల్, కాలేజీ, ఆఫీస్… ఇలా ప్రతి దశలోనూ స్త్రీని గౌరవప్రదంగా చూసే వాతావరణాన్ని కల్పించాలన్నారు. దోషులకి ఒక పక్క శిక్షలు పడుతున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నాయంటే లోపం ఎక్కడుందనే పరిశోధన, సంస్కరణ వెను వెంటనే జరగాలని తెలిపారు.
ఒకనాటి తన సందేశాత్మక చిత్రం ప్రతిఘటనను పదే పదే గుర్తు చేసుకోవాల్సిన అవసరం నేటికీ కనిపించడం దురదృష్టకరమన్నారు విజయశాంతి. దయచేసి అందరూ మేలుకోవాలని.. సృష్టికి మూలంగా నిలిచిన స్త్రీని గౌరవించేలా సమాజాన్ని తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు.