రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ అంశంలో ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు కూడా అదేస్థాయిలో కౌంటర్ ఎటాక్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ఈ అంశంపై స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ రెండు వేల రూపాయల నోటును చెలామణీ నుంచి ఉపసంహరించుకోవడంతో కొన్ని వర్గాలు మళ్లీ గుండెలు బాదుకోవడం మొదలుపెట్టాయని మండిపడ్డారు.
2016లో రూ.500, రూ.1000 నోట్ల రద్దు జరిగినప్పుడే కేవలం తాత్కాలిక సర్దుబాటుగా మాత్రమే రెండు వేల నోటును ప్రవేశపెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అదీగాక ప్రస్తుతం కొద్దో గొప్పో నోట్లు ఉన్నవాళ్లు మార్చుకోవడానికి 4 నెలల సమయం కూడా ఇచ్చిందన్నారు. ఈ నిర్ణయంతో సామాన్యులకి కలిగిన నష్టం ఏమీ లేకున్నా… ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు కొందరు వ్యతిరేక ప్రచారానికి దిగారని మండిపడ్డారు. 2016లో నోట్ల రద్దు జరిగినప్పుడు ఎన్ని నోట్లు మురికికాల్వల్లో కనిపించాయో… ఎంత నల్లధనం అగ్నికి ఆహుతైందో చెప్పాల్సిన పని లేదన్నారు.
ఇతర రాజకీయ పార్టీల్ని దెబ్బకొట్టడానికే ఈ నిర్ణయం జరిగిందని కొందరు అంటున్నారని.. అదే నిజమైతే కర్ణాటక ఎన్నికలకి ముందే ఈ నిర్ణయం వెలువడి ఉండేదిగా అని వ్యాఖ్యానించారు. నిజానికి ‘గులాబీ’ నోటు రద్దుతో గుండెలు బాదుకుంటున్నవాళ్లు ఎవరైనా ఉంటే అది తెలంగాణలోని అధికార ‘గులాబీ’ దళం తప్ప ఇంకెవరూ అయి ఉండరని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమార్జన తీరుని గమనిస్తే అధికారగణం దగ్గర తప్ప ఇంకెక్కడా రెండు వేల నోట్ల కుప్పలు భారీగా కనిపించే పరిస్థితి లేదన్నారు.
ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా లేకపోయినా గులాబీ నేతలు మాత్రం గుబులెక్కి శివాలెత్తిపోతున్నారని విమర్శించారు విజయశాంతి. లక్షల కోట్లున్నాయి కదా.. రెండు వేల రూపాయల నోట్లు కూడా గులాబీ రంగే కదా… బ్యాంకుల్లో ఇవ్వకుంటే… బీఆర్ఎస్ పేర దేశమంతా తోరణాలు కట్టుకోండి అంటూ సెటైర్లు వేశారు.