ఉద్యోగాలపై సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు బీజేపీ నేత విజయశాంతి. ఎన్నికలొస్తే చాలు ఇవిగో నోటిఫికేషన్లు.. అవిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగుల ఓట్లను దండుకుని.. ఎన్నికలు అయిపోయాక ఆ ఊసెత్తని ఆయన డ్రామాలు ఆడడంలో దిట్ట అని విమర్శించారు. తాజాగా నలుగురు ఐఏఎస్ అధికారులతో ‘పరిపాలనా సంస్కరణల కమిటీ’ పేరుతో ఖాళీల భర్తీని జాప్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే… ఆర్థికభారం పెరుగుతుందన్న ఉద్దేశంతోనే ప్రతిసారీ ఏదో ఒక సాకు చెబుతూ నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు విజయశాంతి. “మొన్న ఉద్యోగ ఖాళీల వివరాలు సమగ్రంగా లేవని, పూర్తి వివరాలు సేకరించాలంటూ అధికారులను ఆదేశించి… ఆ తర్వాత విభజన ప్రక్రియ పూర్తి కాగానే భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో కమిటీ పేరిట మరో సాకును ముందుకు తెచ్చి సీఎం కపట కుట్రను బట్టబయలు చేసుకున్నారు” అంటూ ఆగ్రహించారు.
రాష్ట్రంలో 1.91లక్షల ఖాళీలు ఉన్నట్లు బిశ్వాల్ కమిటీ చెప్పగా… దానిని పక్కన పెట్టి మరీ హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని కేసిఆర్ స్వయంగా ప్రకటించారన్నారు విజయశాంతి. కానీ, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మళ్లీ కొత్త కమిటీ అంటూ కాలయాపన చేయడం వల్ల 29 లక్షల మంది నిరుద్యోగులకు నోటిఫికేషన్లపై ఎదురుచూపులే మిగిలనున్నట్టు అర్దమవుతోందని చెప్పారు.
తాజాగా ఏర్పాటైన కమిటీ ఒకవేళ నివేదికను త్వరగా ఇచ్చినా… కేసీఆర్ సర్కార్ మళ్లీ ఏదో సాకును ముందుకు తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు. ఎందుకంటే, ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వెలువడినా మళ్లీ కోర్టు చిక్కుల్లో ఇరుక్కునేలా చేయడం కేసీఆర్ సర్కార్ కు షరా మామూలేనని విమర్శించారు. ఇన్నేళ్లుగా రాష్ట్రంలో అదే జరిగింది కాబట్టి, నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయడానికే చూస్తారని అన్నారు. కానీ.. ఎన్ని జిత్తులు, ఎత్తులు వేసినా రానున్న ఎన్నికల్లో నిరుద్యోగ యువత టీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించడం ఖాయమని జోస్యం చెప్పారు విజయశాంతి.