తాను చేసిన తప్పులను కేసీఆర్.. ప్రధానిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బీజేపీ చేపట్టిన దీక్షలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ప్రపంచమంతా మోడీపై ప్రశంసలు కురిపిస్తుంటే సీఎం మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఫైరయ్యారు.
హిందువులు బొందుగాళ్లని ముఖ్యమంత్రి సంబోధించారని.. ఆయన హిందువా? లేక ముస్లిమా? అని ప్రశ్నించారు విజయశాంతి. కేసీఆర్ దేవుడికి కూడా అబద్ధం చెప్పారని.. ఆ శివుడు ఊరుకోడని.. మూడో కన్ను తెరుస్తాడని సీఎం సంగతి తేలుస్తాడని హెచ్చరించారు.
రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల చొప్పున ఇస్తానని కేసీఆర్ చెప్పారని.. వెంటనే రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఆయనకు సంస్కారం లేదని విమర్శించారు. వేములవాడ రాజన్నకి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఆలయం దగ్గర భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేవని… గుడి చిన్నగా ఉందన్నారు విజయశాంతి. అభివృద్ధి అంటే అరెస్ట్ లు చేయడమే కేసీఆర్ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్యెల్యే ఉన్నా వేస్ట్.. జిల్లా మంత్రి వల్ల ఏం లాభం అని చురకలంటించారు విజయశాంతి