హైదరాబాద్ నగరం గంజాయికి అడ్డాగా మారిందన్నారు బీజేపీ నేత విజయశాంతి. నగరంలో ఎక్కడబడితే అక్కడ గంజాయి దొరుకుతోందని.. పలు ప్రాంతాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా డ్రగ్స్ అమ్ముతున్నారని ఆరోపించారు. గతంలో డ్రగ్స్ పై హడావిడి చేసిన పోలీసులు ఇప్పుడు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులతో పాటు ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.
డ్రగ్స్‌తో పాటు గుట్టు చప్పుడు కాకుండా బెల్ట్ షాపులు కూడా నిర్వహిస్తున్నారన్నారు విజయశాంతి. బెల్ట్ షాపులు, గుడుంబా బస్తీల్లోని పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుట్టుగా గంజాయి సరఫరా అవుతుండడంతో యువత నిత్యం మత్తులో మునిగి తేలుతోందని వివరించారు. గతంలో మద్యం మత్తులో అనేక హత్యలు, కొట్లాటలు జరిగినా పోలీసులు చోద్యం చూశారని అన్నారు.
మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రీ పగలు అనే తేడా లేకుండా బెల్ట్ షాపులు తెరిచి ఉండడం, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతుండడంతో యువత మత్తులో మునిగి తేలుతోందన్నారు విజయశాంతి. పాపిరెడ్డి కాలనీలో ఇటీవల ఓ బెల్ట్ షాపులో మద్యం తాగిన యువకుడిని అతి దారుణంగా హత్య చేశారని చెప్పారు. అక్కడ బెల్డ్ షాపు వల్ల నిత్యం యువకుల మధ్య, భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఎక్కువయ్యాయని తెలిపారు. పలు సందర్భాల్లో అక్రమ మద్యం, గంజాయి, గుట్కా పట్టుబడి, కేసులు నమోదయ్యాయని.. అయినా పోలీసులు వాటిని అరికట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు.
కాసులకు కక్కుర్తిపడి నెల మామూళ్ళు వసూలు చేస్తున్న కొందరు పోలీసుల వల్లే బెల్ట్ షాపులు జోరుగా నడుస్తున్నాయని మండిపడ్డారు విజయశాంతి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ సర్కార్ మొద్దు నిద్రపోతోందని ఫైరయ్యారు. ఇప్పటికైనా అక్రమంగా మద్యం, గుండుంబా, గంజాయి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనం బతుకులతో ఆడుకుంటున్న కేసీఆర్ సర్కార్‌ను ఆ ప్రజలే బంగాళాఖాతంలో కలపడం ఖాయమని జోస్యం చెప్పారు.