కేసీఆర్ ఉద్యోగాల ప్రకటనపై ఎంతోమంది నేతలు మాట్లాడారు. ఎవరికివారు తమదైన రీతిలో స్పందించారు. అయితే.. బీజేపీ నేత విజయశాంతి రియాక్షన్ ఏంటా? అనే ఆసక్తి అందరిలో ఉంది. ఆమె దీనిపై ఏమంటారా? అని అనుకుంటున్న సమయంలో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ సెటైర్లు వేశారు.
”సీఎం కేసీఆర్ గతంలో 4 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో కేవలం 80 వేలే అంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటే చూస్తూ ఊరుకున్న సీఎం సారుకి.. ఇప్పుడే ఉద్యోగాల భర్తీ ఎందుకు గుర్తోచిందంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు” అని తేల్చేశారు విజయశాంతి.
నిరుద్యోగుల ఓట్ల కోసమే కొత్త ఉద్యోగాలంటూ కేసీఆర్ కొత్త రాగం పాడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం.. ఇప్పుడు ఉద్యోగాలంటూ ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు విజయశాంతి. ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయన్నారు.
కేసీఆర్ ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు విజయశాంతి. 18 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఫైరయ్యారు. ఇలాంటి నియంత దేశంలో ఎక్కడా లేరని… ఇన్నాళ్లూ కనీసం టెట్ కూడా నిర్వహించలేదని విరుచుకుపడ్డారు.
కేసీఆర్ కి కాషాయ సెగ తగిలిందని… అందుకే దొరవారు దిగి వచ్చారని సెటైర్లు వేశారు. దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి భయపడి నక్క జిత్తుల వేషాలు వేస్తున్నారని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరడం తట్టుకొలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్ నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరని తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు విజయశాంతి.