తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కా హిందూ వ్యతిరేకి అనే విషయం అడుగడుగునా స్పష్టమవుతోందన్నారు బీజేపీ నేత విజయశాంతి. కేంద్ర బడ్జెట్ సందర్భంగా కేవలం బీజేపీని తిట్టిపోసేందుకే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అసదుద్దీన్ ఓవైసీ ఒక వెలుగు వెలగాలని పదే పదే కోరుకున్నారని గుర్తు చేశారు. ఆ సమయంలో అసద్ తమ సోదరుడని చెబుతూ.. ఎంఐఎంని ఉద్దేశించి ‘హమారా పార్టీ హైస’.. అని కూడా అన్నారని తెలిపారు.
ఇదే అసదుద్దీన్, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ గతంలో ఎన్నిసార్లు హిందువులను ఉద్దేశించి చులకనగా వ్యాఖ్యలు చేసి అవమానించారో, బెదిరింపులకు పాల్పడ్డారో ఒక్కసారి యూట్యూబ్ లో వారి పాత వీడియోలు చూస్తే అర్థమవుతుందని అన్నారు విజయశాంతి. 15 నిమిషాలు పోలీసుల్ని పక్కన పెడితే 100 కోట్ల మంది హిందువులకు వారి చోటేమిటో చూపిస్తామని వ్యాఖ్యానించింది ఎవరు?.. మొన్నటికి మొన్న యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోడీ, యోగి ఆ పదవుల నుంచి తప్పుకుంటే అప్పుడు మీ గతేంటో చూసుకోండి, మేం మర్చిపోం అని యూపీ పోలీసులని, అధికారులని కూడా అసద్ హెచ్చరించారని వివరించారు.
టీఆర్ఎస్ సయామీ కవల పార్టీ ఎంఐఎం అధినేత, ఆ పార్టీ నేతల తీరు ఇదే. ఇలా ఎన్నోసార్లు హిందువులకు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినా పట్టనట్టు వ్యవహరిస్తూ… చేతగాని దద్దమ్మలా పడి ఉండటమే కాకుండా వారికి మద్దతు పలుకుతున్న కేసీఆర్ ని హిందూ వ్యతిరేకి గాక మరేమనాలని ప్రశ్నించారు. చివరికి యాదాద్రి ఆలయాన్ని కూడా వ్యక్తిగత ప్రచారానికి వాడుకుని తమ శిల్పాలు చెక్కించుకున్నారని విమర్శించారు. అందరూ ఛీ కొట్టాక వాటిని తొలగించారని గుర్తు చేశారు.
ఇప్పుడు సమతామూర్తి రామానుజుల విగ్రహావిష్కరణకు హైదరాబాద్ విచ్చేసిన ప్రధాన మంత్రి కార్యక్రమానికి కావాలనే డుమ్మా కొట్టి ఒంట్లో బాగా లేదని అధికారులతో చెప్పించారని అన్నారు విజయశాంతి. కేసీఆర్ చేసే యాగాలు, పూజలు కేవలం హిందువుల ఓట్ల కోసమేనని.. ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. అలాగే ఆయన్ను గద్దె దించి ఇంటికి ఎలా పరిమితం చెయ్యాలో కూడా తెలుసని అన్నారు విజయశాంతి.