తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు దూరం అవుతున్నాయని విమర్శించారు బీజేపీ నేత విజయశాంతి. ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా అందాల్సిన వైద్య సేవలు పెయిడ్ సర్వీసులుగా మరిపోతున్నాయని ఆరోపించారు. ప్రతీ టెస్టుకూ దారుణంగా పైసలు వసులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీటీ స్కాన్ కు రూ.500 నుంచి రూ.800, ఎంఆర్ఐకి రూ.2 వేలు, పెట్ స్కాన్ కు రూ.5 వేలు చార్జ్ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
హైదారాబాద్ లోని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ లో ఎంతో కాలం నుంచి డబ్బుల వసూలు జరుగుతోందన్నారు విజయశాంతి. తాజాగా కోఠీలోని ఈఎన్‌టీ హాస్పిటల్, ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ లోనూ పైసల వసూలు కార్యక్రమాలు మొదలుపెట్టారని చెప్పారు. డబ్బులెందుకని అడిగితే… కడితేనే వైద్యం, లేకుంటే లేదని మోహం మీదనే చెబుతున్నారని తెలిపారు. డబ్బులు కట్టినట్టు రసీదు అడిగితే… ఆసుప్రతి డెవలప్‌మెంట్ కింద డొనేషన్ ఇచ్చినట్టు ఒక స్లిప్ ఇస్తున్నారని మండిపడ్డారు. డొనేషన్ స్లిప్ ఎందుకు ఇచ్చారని అడిగితే… రోగుల్ని దబాయించి పంపిస్తున్నారన్నారు.
రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకే చార్జీలు వసూలు చేస్తున్నామని హెల్త్ ఆఫీసర్లు చెబుతున్నారని తెలిపారు విజయశాంతి. పేదలకు ఉచిత వైద్యం, విద్య అందిస్తామని చెప్పి అందలం ఎక్కిన కేసీఆర్… ఇప్పుడు వాటినే దూరం చేస్తున్నారని ఫైరయ్యారు. ఎంఎన్‌జే రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ట్రీట్ మెంట్ అందించేందుకు ఉన్న ఏకైక సర్కార్ దవాఖానా అని… మూడేండ్ల నుంచీ అక్కడ చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టారని చెప్పారు. అదేంటని ప్రశ్నిస్తే… ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు రాగానే పేషెంట్లకు రీఫండ్ చేస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటిదాకా ఎవరికీ పైసా కూడా రీఫండ్ చేయలేదన్నారు.
మరోవైపు రూ.500తో మొదలైన చార్జీలు ఇప్పుడు వేలల్లోకి వెళ్లిపోయాయని… గాంధీ, ఉస్మానియా వంటి ఇతర ఆసుపత్రుల నుంచి రిఫరల్ పై వచ్చే పేషెంట్లకైతే ఇంకో రూ.వెయ్యి ఎక్కువే తీసుకుంటున్నారని వివరించారు. పేదలు డబ్బులు కట్టలేక ఇబ్బందులు పడుతుంటే… కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకులేదని మండిపడ్డారు. పైసలతో పందారం చేస్తున్న ఈ దొరల సర్కార్ కు పేద ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని చెప్పారు విజయశాంతి.