బీజేపీని అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి.. అనే సామెత గుర్తుకొస్తోందన్నారు విజయశాంతి. కాషాయదళాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ వేస్తున్న అడుగులు తప్పటడుగులు తప్ప ఇంకేం కాదనడానికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయమే పెద్ద ఉదాహరణగా వివరించారు.
“జాతీయస్థాయిలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి అంటూ కేసీఆర్ బీరాలు పలికారు. విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపిక అనంతరం అయనకు మద్దతునిచ్చే విషయంలో ఏ నిర్ణయమూ వెంటనే చెప్పలేదు. బీజేపీని అడ్డుకునే విషయంలో తాను నిజాయితీగానే ఉన్నట్టు నటించారు. చివరికి కాంగ్రెస్ పార్టీ ఉన్న విపక్ష కూటమి అభ్యర్థికే మద్దతు పలికారు. తమ గులాబీ రంగు ఎప్పటికైనా వెలిసిపోయేదే.. కాంగ్రెస్ తో కలిసిపోయేదే అన్నట్టుగా అసలు రంగు బయటపెట్టుకున్నారు” అంటూ మండిపడ్డారు.
కేసీఆర్ మేకపోతు గాంభీర్యానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ తీరు కూడా ఉందన్నారు విజయశాంతి. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నానా విమర్శలూ చేసుకుంటున్నట్టు పైకి బిల్డప్పులిస్తుంటే.. జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, సోనియాలు ఏమీ స్పందించరని చెప్పారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ దాఖలు సమయంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ యువరాజులు రాహుల్, కేటీఆర్.. ఇద్దరూ కలసికట్టుగా ఉల్లాసంగా కనిపించారని గుర్తు చేశారు.
ఇంకోపక్క ఇలాంటి విషయాల్లో ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఎంతమాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకి భిన్నంగా వ్యవహరించదని అందరికీ తెలుసన్నారు విజయశాంతి. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఓట్ల కోసం పరస్పరం విమర్శించుకున్న టీఆర్‌ఎస్, ఎంఐఎం తర్వాత ఎంత అన్యోన్యంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నామని చెప్పారు. ఇన్నాళ్ళూ సయామీ ట్విన్స్ గా ఉంటూ వచ్చిన టీఆర్‌ఎస్, ఎంఐఎంలకి కాంగ్రెస్ కూడా తోడై మూడు పార్టీలు కలసి సయామీ ట్రిప్లెట్స్ అవతారమెత్తాయని చురకలంటించారు.
తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడంలో ఈ పార్టీలు పోటీపడుతున్నాయన్నారు విజయశాంతి. కేసీఆర్ ఎంత కిందా మీదా పడినా ఆయన ప్రతిపాదించిన ఆ బీఆర్‌ఎస్ కి స్పందన రాదని… ఈ సయామీ ట్రిప్లెట్స్ తో సహా కేసీఆర్ బీఆర్‌ఎస్ కి.. రాష్ట్రంలో మాతృపార్టీ టీఆర్‌ఎస్ కి ప్రజలు వీఆర్‌ఎస్ ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు.