ఏపీలో కూడా విస్తరించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు నేతలకు గులాబీ కండువా కప్పారు. ఏపీ ప్రజలు తమకు అండగా ఉండాలని కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయినా.. తమ హయాంలో తిరిగి ప్రభుత్వంలోకి తీసుకొస్తామని ప్రజలను ఆకర్షించే డైలాగులు చెప్పారు. అయితే.. ఆంధ్రాలో బీఆర్ఎస్ వల్ల మిగిలిన పార్టీలకు నష్టం ఉంటుందా? లేదా? అనే చర్చ మొదలైంది. ఈక్రమంలో బీజేపీ నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జనసేనను, ఆపార్టీతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలే సంకేతాలు ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే ఏపీలోనూ అక్కడి ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారని విమర్శించారు.
ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన అత్యంత బలమైన ఒక సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేయటానికి కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దుష్ప్రయత్నం చేస్తున్నారన్నారు విజయశాంతి. దీన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టి వేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు.
కేసీఆర్ ధనిక తెలంగాణను అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. అలాంటి కేసీఆర్ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు.