దేశమంతా అయోధ్య తీర్పుపై ఉత్కంఠతతో ఎదురుచూసి ప్రతిస్పందిస్తుంటే… తెలంగాన సీఎం కేసీఆర్ స్పందించక పోవటంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎంఐఎం కోసమే సైలెంట్‌గా ఉన్నారని మండిపడ్డారు.
సుప్రీం తీర్పుపై స్పందించకుండా, తప్పించుకోవటం వెనుక చాలా మతలబు ఉందన్నారు. దేశమంతా రామమందిరం నిర్మాణంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే… తెలంగాణ సీఎం దొరగారు మాత్రం సెక్యూలరిజం పేరుతో… ఎంఐఎం ప్రాపకం కోసం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. పైకి తాను అసలైన హిందువునని చెప్పుకునే కేసీఆర్ గారికి లోలోపల రామమందిర నిర్మాణం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది అని కామెంట్ చేసింది రాములమ్మ.
అయోధ్య అంశాన్ని గతంలో తోకతో పోలుస్తూ కేసీఆర్ విమర్శించటం దొరగారి అహంకారానికి నిదర్శనమని…ఇంతకు ముందు మనస్సులో మాట బయటపెట్టిన కేసీఆర్ ఇప్పుడు సుప్రీం తీర్పుతో రామాలయ నిర్మాణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీన్నే కుహానా లౌకికవాదం అంటారని, గతంలో కేసీఆర్ ఎమన్నారో వీడియో చూస్తే అర్థమవుతుంది అంటూ ఫేస్‌బుక్ లో ఆ వీడియోను పోస్ట్ చేసింది రాములమ్మ.