– టీడీపీతో పొత్తుపై బీజేపీ క్లారిటీ
– రాష్ట్ర నాయకత్వాన్ని అడిగిన విజయశాంతి
– అరవింద్ కూడా అదే మాట
– వెంటనే రియాక్ట్ అయిన బండి
– తెలంగాణలో పొత్తు ఉండదని స్పష్టం
కొన్నాళ్లుగా బీజేపీకి చంద్రబాబు దగ్గరవుతున్నారనే చర్చ ఉంది. కమలనాథులను మచ్చిక చేసుకుని మరోమారు అధికారం దక్కించుకోవాలని ఆయన పావులు కదుపుతున్నారని అంటున్నారు. అటు ఏపీలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్న చంద్రబాబు.. ఇటు తెలంగాణపైనా ఫోకస్ పెట్టారు. ఈమధ్యే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మరికొన్ని ప్రాంతాల్లో చేయాలని చూస్తున్నారు. టీడీపీకి తెలంగాణలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో పొత్తు వార్తలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పొత్తుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరారు. ఎంపీ అరవింద్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వాలన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణలో టీడీపీతో పొత్తు వుండదని స్పష్టం చేశారు. కార్యకర్తలతో ఈ విషయం చెప్పాలని పేర్కొన్నారు. సంజయ్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అనంతరం ఇక కేసీఆర్ పాలనపై స్పందించిన విజయశాంతి.. తెలంగాణలో అవినీతి భయంకరంగా జరుతోందని ఆరోపించారు. ‘‘ఇన్నాళ్లకు దేవుడు కనికరించాడు.. మా గోడు దేవుడు విన్నాడు’’ అని అన్నారు. ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తీసుకువస్తే.. తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. ఒక కుటుంబానికి మాత్రమే న్యాయం జరుగుతోందన్నారు.
ఈడీ రెయిడ్స్ కు ఎక్కువగా హంగామా చేస్తున్నారంటే ఏదో తప్పు ఉందన్నట్టేగా అంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ఒకరిద్దరి మీదనే కాదు.. బీఆర్ఎస్ నాయకులందరి మీద దాడులు జరగాలన్నారు. వాళ్లు ఎంత దోచుకున్నారో ప్రజలకు తెలియాలని చెప్పారు. తెలంగాణ ముసుగుతో ఎలా దోచుకుంటున్నారో ప్రజలు తెలుసుకోవాలన్నారు.