టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మరోసారి మాటల దాడి చేసింది కాంగ్రెస్ నేత విజయశాంతి. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచారు, నేడు పాల ధర పెంచారు, రేపు కరెంట్ చార్జీలను పెంచబోతున్నారు… రాబోయే రోజుల్లో రోడ్డుపై నడిచినా సామాన్య జనంపై పన్ను వేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అంటూ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసింది రాములమ్మ.
అభివృద్ధి పేరుతో ఇంకాలం గారడీ చేసిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెను చూపి చార్జీలు పెంచాడు, పాల ధరను కూడా పెంచాడు, ఇప్పుడవన్నీ చాలవన్నట్లు కరెంటు చార్జీలు భారీగా పెంచేందుకు రెడీ అయినట్లు తెలుస్తోందంటూ మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం చేసే దుబారా ఖర్చులకు సామాన్యుడి నడ్డి విరిచి, డబ్బులు వసూలు చేస్తే తప్పా ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు.
దుబారా ఖర్చులపై ప్రతిపక్షాలు ఎన్ని సార్లు హెచ్చరించినా… కేసులు పెడతానని సీఎం బెదిరించారు, టీఆర్ఎస్ పాలకులు చేసిన పాపం ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందని ఆరోపించారు. ప్రభుత్వ వాలకం చూస్తుంటే… రాబోయే రోజుల్లో సామాన్యులు ఎవరైనా రోడ్డు మీదకు వచ్చినా డబ్బులు వసూలు చేస్తే తప్పా ప్రభుత్వాన్ని నడపలేమని చేతులెత్తేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ ఎద్దేవా చేశారు. దీన్నే బంగారు తెలంగాణ అంటారేమో అంటూ విమర్శించారు విజయశాంతి.