విజయశాంతి, బీజేపీ సీనియర్ నేత
రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. తమది రైతుల ఆదాయం రెట్టింపు చేసే ప్రభుత్వమన్నారు. రైతు పండించే ప్రతీ గింజ కొంటామని కేసీఆర్ ప్రగల్బాలు పలికారు. కానీ.. ఈ యాసంగిలో వరి సాగు చేయొద్దని, వేస్తే కొనుగోలు చేయమని రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికే రైతులు నాట్లు వేశారు. కొన్నిచోట్ల వరి పంట వర్షానికి కొట్టుకుపోయింది. ఇది చాలక, ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకుండా ఆందోళనలో పడేయడం సిగ్గుచేటు.
ఈ వానాకాలంలో 60 లక్షల టన్నుల వడ్లను కొంటామని కేంద్రం ప్రకటించగా.. మిగతా ధాన్యాన్ని సేకరించే బాధ్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటోంది. రైతులకు అన్నీ మేమే చేస్తున్నాం, మాది రైతు ప్రభుత్వం అన్న టీఆర్ఎస్ సర్కార్ ధాన్యం ఉత్పత్తి పెరిగినప్పుడు కొనుగోలు చేసి, గోదాముల్లో నిల్వచేసి, రైతులను ఆదుకోకుండా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తోంది. కేంద్రం ఎఫ్‌సిఐ ద్వారా గోడౌన్స్ నిర్మాణాలకు కేటాయించిన సొమ్ముతో ఎన్ని నిర్మించిందో కేసీఆర్ ప్రభుత్వం చెప్పాలి.
కేంద్రమే ధాన్యం కొనుగోలుకు నిధులు కేటాయిస్తుంటే.. మేమే కొంటున్నాం అని ఇన్ని సంవత్సరాలుగా రైతులను మభ్యపెట్టి, ఇప్పుడు కేంద్రంపై నిందలు వేస్తూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. లేనిపోనివి చెప్పి ప్రజలను ఎంతగా మభ్యపెట్టాలని చూసినా హుజూరాబాద్ లో బీజేపీ జెండా ఎగరడం ఖాయం.