బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళతామన్నారు ఆపార్టీ నేత విజయశాంతి. తాను గతంలోనే ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పానన్నారు. కానీ, ఈ అంశంలో అయోమయం సృష్టించేందుకు, చివరికి మీడియాని కూడా ఇతర పార్టీల నేతలు తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. అందుకే మరోసారి స్పందిస్తున్నట్లు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయమై మీడియా ద్వారా స్పష్టత ఇచ్చానన్నారు విజయశాంతి. తాజాగా ఒక మీడియా మిత్రుడు సంజయ్ అధ్యక్ష పదవి గురించి ఎంపీ లక్ష్మణ్ ని ప్రశ్నిస్తే.. ఆయన కూడా ఎంతో స్పష్టంగా మళ్లీ బదులిచ్చారని చెప్పారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ ప్రజా సంగ్రామ యాత్రను ప్రశంసించారని.. లక్ష్మణ్ దీన్ని గుర్తు చేస్తూ ప్రధాని ఇచ్చిన కితాబే సంజయ్ కొనసాగింపునకు సంకేతమని తేల్చి చెప్పారని తెలిపారు. బీజేపీలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదన్నారు. కేసీఆర్ కుయుక్తుల ప్రచారాలు ఇక్కడ చెల్లవన్నారు విజయశాంతి.
జాతీయవాదులు, హిందూ బంధువులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ శివాజీ మహరాజ్ ప్రతిరూపపు ఆవేశంతో ముందుకు సాగాలన్నారు. అలాగే, నరేంద్ర మోడీ స్ఫూర్తితో బండి సంజయ్ అధ్యక్షతన రాబోయే ఎన్నికల రణక్షేత్రానికి ఇప్పటి నుండే అనుక్షణం సైనికులై పనిచేసే సందర్భం ఆసన్నమైందని చెప్పారు. అడుగడుగునా కలిసి నడుద్దాం.. ప్రతి ప్రజా సమస్యపై పోరాడుదాం.. బీజేపీ రాజ్యం తెలంగాణలో సాకారం చేద్దామని పిలుపునిచ్చారు విజయశాంతి.