ఏపీని డ్రగ్స్ వార్త కుదిపేస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి విజయవాడ అడ్రస్ తో రూ.9వేల కోట్ల హెరాయిన్ గుజరాత్ కు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అతిపెద్ద డ్రగ్ రాకెట్ కన్ను బెజవాడపై పడిందా..? డ్రగ్ డీలర్లు ఆ ఏరియాను కేంద్రంగా మార్చుకున్నారా..? లాంటి అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు సైతం షాక్ కు గురైన పరిస్థితి. ఈక్రమంలో నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు స్పందించారు.
గుజరాత్ పోర్టులో పట్టుబడిన హెరాయిన్ తో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు సీపీ. ఆఫ్గాన్ నుంచి దిగుమతి చేసుకున్న డ్రగ్స్ ను నగరానికి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లుగా కథనాలు వెలువడటంతో.. దీనిపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చైన్నైలో స్థిరపడిన మాచవరం సుధాకర్ అనే వ్యక్తి తన భార్య దుర్గా పూర్ణ వైశాలి పేరుతో అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతులకు సంబంధించి డీజీఎఫ్టీ నుంచి లైసెన్స్ పొందారని చెప్పారు. అయితే వైశాలి తల్లి తారకకు చెందిన ఇంటి చిరునామాతో సదరు లైసెన్స్ తీసుకున్నారని వివరించారు. హెరాయిన్ కన్ సైన్ మెంట్ సంస్థ అడ్రస్ విజయవాడ నగరానికి చెందినది కావడం తప్ప… మిగిలిన విషయాలన్నీ వాస్తవం కాదన్నారు సీపీ శ్రీనివాసులు.
సుధాకర్, వైశాలి దంపతులు చాలా ఏళ్ల క్రితమే చైన్నైలో స్థిరపడ్డారని వివరించారు సీపీ. టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి అయిన హెరాయిన్ విజయవాడకు తరలిస్తున్నారనే వార్తలు నిజం కాదని చెప్పారు. అది ఢిల్లీకి బుక్ చేయబడిందన్నారు. ఫారిన్ ట్రేడ్ లైసెన్స్ కోసం వినియోగించుకున్న ఇంటి చిరునామా తప్ప.. ఆఫ్ఘాన్ దిగుమతి అయిన మాదకద్రవ్యాలతో విజయవాడకు ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు ప్రకటించారు. అయినా దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు శ్రీనివాసులు.
అఫ్ఘాన్ నుంచి విజయవాడకు టాల్కం పౌడర్ పేరుతో కంటైనర్ లలో అక్రమంగా డ్రగ్స్ రవాణా అవుతోంది. ఫ్రమ్ అడ్రస్.. కాందహార్ కు చెందిన హసన్ హుస్సేన్ లిమిటెడ్ సంస్థది కాగా… టూ అడ్రస్.. విజయవాడకు చెందిన ఆషీ ట్రేడింగ్ కంపెనీది. కన్ సైన్ మెంట్ లో ఉన్న అడ్రస్ ద్వారా కూపీ లాగుదామని విజయవాడ సత్యనారాయణపురం వెళ్లారు అధికారులు. వివరాలు అన్నీ సేకరించారు. ఈ కంపెనీ కార్యకలాపాలు ఏవీ విజయవాడలో జరగడం లేదని తెలిపారు.