సంక్రాంతి పండగ అయిపోంది. మళ్లీ గ్రామాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం ప్రజలు నగరాలకు తిరుగుపయనం అవుతున్నారు. సోమవారం నుంచే ఆఫీసులు తెరుచుకున్నాయి. దీంతో.. గత వారం రోజులుగా బోసిపోయిన భాగ్యనగరం తిరిగి కలను సంతరించుకొంటుంది. సొంతూర్ల నుంచి హైదరాబాద్ కి ప్రజలు వస్తుండటంతో హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో పల్లెల నుంచి జనాలు పట్నం బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే… హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ భారీగా పెరిగి పోయింది. రద్దీ దృష్ట్యా పంతంగి టోల్ ప్లాజా , కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అదనపు టోల్ చెల్లింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు సాధారణం కంటే హైవేపై రెట్టింపు వాహనాలు వస్తున్నాయి. దీంతో అధికారులు దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అటు సొంతూళ్ల నుంచి.. హైదరాబాద్ కు వచ్చే వారి కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 3500 బస్సులను ఏర్పాటు చేసింది.
కాగా.. అటు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల సెలవులను టీఆర్ఎస్ సర్కార్ పెంచింది. జనవరి 16 వ తేదీతో ముగియాల్సిన సంక్రాంతి సెలవులు.. సర్కార్ నిర్ణయంతో.. జనవరి 30 వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి.