విజయవాడ:
విజయవాడలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా జ్వర పీడితులు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోయాయి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జ్వర పీడితులు ఎక్కువైపోయారు. ఏ వార్డు చూసినా వాళ్ళే దర్శనమిస్తున్నారు. పడకలు చాలకపోవడంతో ఆరు బయట, కింద పడుకోబెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితిలో వైద్యం అందించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 పడకలుంటే బాధితులు వందల్లో వస్తున్నారు. ఇందులో ప్రధానంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విష జ్వర పీడితులు ఎక్కువుగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సీపీఎం నేత సీహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలని, నూతనంగా నిర్మించిన భవనం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు ఆసుపత్రిలో ఈ రోజు పర్యటించి, సమస్యలు తెలుసుకున్నారు.