గన్నవరం నియోజకవర్గం నివురు గప్పిన నిప్పులా మారింది.దాడులు ప్రతి దాడులతో గన్నవరం అట్టుడుకింది. గన్నవరం పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలోకి కొత్తవారిని రానివ్వకుండా కట్టడి చేస్తున్నారు. వంశీ అనుచరులు, టీడీపీ నేతల దాడుల్లో పలు కార్లు దగ్ధమయ్యాయి. దాడుల్లో పాల్గొన్న వారిలో 16 మందిని అరెస్ట్ చేసి మచిలీపట్నం తరలించారు.
నియోజకవర్గంలో వంశీ అల్లర్లు ప్రేరేపిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. బయటి వ్యక్తులకు నియోజకవర్గంలో పనేంటని వల్లభనేని వంశీ ప్రశ్నిస్తున్నారు. నిన్న జరిగిన పరిణామాలపై టీడీపీ నేతలు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో గన్నవరంలో టెన్షన్ వాతావరణంనెలకొనడంతో పోలీసు యంత్రాంగం గన్నవరంలో 144 సెక్షన్ విధించింది.సోమవారంసాయంత్రం గన్నవరంలోని టిడిపి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పట్టాభి రామ్ ని పోలీసులు అందుపులోకి తీసుకున్నారు.
పట్టాభిరామ్ ఆచూకిని పోలీసులు చెప్పకపోవటంతో కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఈరోజు ఛలో గన్నవరం అధిష్టానం పిలుపునివ్వడంతో జిల్లాలోని టీడీపీ నాయకులంతా గన్నవరం బయలుదేరుతుండటంతో అర్ధరాత్రి పోలీసులు పార్టీ నాయకులను వెళ్లకుండా అరెస్టు చేశారు.
గన్నవరం టీడీపీ పార్టీ కార్యాలయం విధ్వంసానికి నిరసనగా టీడీపీ జిల్లాకి రావాలని పిలుపినిచ్చింది. దీంతో టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు . అలాగే జగ్గయ్యపేట మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాముని పోలీసులు అర్ధరాత్రి ఆయన స్వగృహంలోనే అరెస్ట్ చేసి బయటికి వెళ్లకుండా ముగ్గురు పోలీస్ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్నారు.
గన్నవరంలో అరెస్ట్ చేసిన తెలుగు మహిళలను మచిలీపట్నం తరలించారు పోలీసులు.మంగినపూడి బీచ్ సమీపంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మహిళలు టీడీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసుల కాపలా కాస్తున్నారు.జిల్లా వ్యాప్తంగా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శావల. దేవదత్ ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగాగన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ వర్గీయుల దాడిని ఖండించిన తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శావల. దేవదత్ ఏపీలో వైసిపి ప్రతిపక్ష పార్టీలపై దాడులు, బెదిరింపులు, విధ్వంసాలకు తెగబడుతోందన్నారు.
ఇదిలాఉంటే.. పట్టాభి భార్య చందన పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. తన భర్తను ఎవరు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? అరగంటలో స్పష్టమైన సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్ష చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు చందన. తన కూతురు రాత్రి నుంచి భయంభయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు చందన. తన భర్త జాడ చెప్పకపోతే.. ఎట్టి పరిస్థితుల్లో డీజీపీ ఇంటికి వెళ్తానంటున్నారు పట్టాభి భార్య చందన.