కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా సాగుతోంది టీఆర్ఎస్ రాజ్యంలో. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం వరి కొనుగోలులో భారీ గోల్ మాల్ బయటపడింది. పుట్టాపహాడ్, బండ వెల్కిచర్ల, ఇప్పాయిపల్లి, కుసుమ సముద్రం గ్రామాల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి దాదాపు మూడు వేల వరి ధాన్యం బస్తాలు పక్కదారి పట్టినట్లు రైతులు ఆరోపిస్తున్నారు.
ఒక్కో రైతుకు చెందిన 9 నుండి 10 బస్తాలను వారికి తెలియకుండా దారి మళ్లించారు కేటుగాళ్లు. దాదాపు 22 లక్షల వరకు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పుట్టాపహాడ్ కు చెందిన భీమమ్మ అనే మహిళా రైతుకు రూ.1,03,462 రావాల్సి ఉండగా.. కేవలం రూ.33,220 మాత్రమే ఆమె అకౌంట్లో జమ అయ్యాయి. ఇలా ఏ రైతును కదిలించిన అదే పరిస్థితి.
రైతుకు ఇచ్చిన రశీదుకు కొనుగోలు సెంటర్లో ఉన్న రశీదుకు తేడాలున్నాయి. దీంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. బతికుండగానే రైతుబీమా కాజేసిన రాఘవేంద్ర రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి కలిసి ఇదంతా చేసినట్లు చెబుతున్నారు రైతులు. వీరితోపాటు కొంతమంది స్థానిక నాయకులు కూడా కుమ్మక్కయ్యారని అనుమానిస్తున్నారు.