వికారాబాద్ జిల్లా మీర్జాపూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మైనింగ్ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండగా కాంట్రాక్టర్, గ్రామస్తుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకానొక దశలో కాంట్రాక్టర్ పై గ్రామస్తులు దాడి చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో, పోలీసులు కాంట్రాక్టర్ ను అక్కడి నుంచి పంపించేశారు.
పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 41లో ఎస్ఆర్ మినరల్స్ కు చెందిన కంపెనీ 9.91 హెక్టార్లలో ల్యాట్రేట్ మైనింగ్ కోసం లీజుకు తీసుకుంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్జీవోలు డబ్బులు పంచుతున్నారనే విషయంలో వాళ్లని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీయడంతో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. పోలీసులకు కంప్లయింట్ చేసినా పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు మైనింగ్ యజమానులను నిలదీశారు. ఆ సమయంలో వారిపై రాళ్లు కూడా విసిరారు గ్రామస్తులు. మైనింగ్ ప్రాంతంలో కొంతసేపు ఆందోళన చేపట్టారు. పోలీసులు యజమానిని పంపించేసి గ్రామస్తులను చెదరగొట్టారు.