ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తున్నాయి. అనుభవలేమి డ్రైవర్లు, టికెట్లు ఇవ్వని కండెక్టర్లు, ఆర్టీసీ సొమ్మును పంచుకుంటున్న డ్రైవర్-కండక్టర్ ఇలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఒక బస్సులో ఇద్దరు కండక్టర్లు ఉండటంతో జనం అవక్కాయిన ఘటన వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ డిపోకు చెందిన బస్సు సదాశివపేటకు వెళ్లేందుకు బస్సు బయల్దేరింది. బస్సు వికారాబాద్ స్టేషన్ వరకు రాగానే ఓ కండక్టర్ బస్సు ఎక్కారు. అప్పటికే బస్సులో మరో కండక్టర్ ఉండటంతో… నేను కండక్టర్ అంటే నేను కండక్టర్ అంటూ ఇద్దరూ గొడవపడ్డారు. నేను వారం నుండి ఉన్నాను అని ఒకరు, నా చేతిలో మిషన్ ఉంది చూడు అని మరొకరు గొడవకు దిగారు. డిపో మేనేజర్‌కు కొంతమంది కాల్ చేసినా ఆయనా స్పందించలేదు. దీంతో ప్రయాణికులు ఇదేం ఘోరంరా బాబు అంటూ ఫైర్ అయ్యారు.
ఆర్టీసీ సమ్మె ముగిసి, రెగ్యూలర్ ఉద్యోగులు డ్యూటీలోకి వచ్చేలోపు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అంటూ జనం నవ్వుకుంటున్నారు. మేము డ్యూటీలో ఉంటే… కండెక్టర్‌ను ఏర్పాటు చేయకుండా డ్రైవర్‌తోనే టికెట్లు ఇప్పించే యాజమాన్యం, తాత్కాలిక ఉద్యోగులను మాత్రం అవసరం లేకున్నా ఇద్దరు-ముగ్గురును కేటాయిస్తుండటం వింతగా ఉందని ఆరోపిస్తున్నారు రెగ్యూలర్ ఉద్యోగులు.