నటీనటులు: కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రవిశంకర్ గౌడ్ తదితరులు..
రచయిత-దర్శకుడు: అనూప్ భండారి
బ్యానర్లు: జీ స్టుడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలినీ ఆర్ట్స్
నిర్మాత: షాలిని జాక్ మంజు, అలంకార్ పాండియన్
సంగీతం: బి అజనీష్ లోక్ నాథ్
సినిమాటోగ్రఫీ: విలియం డేవిడ్
ఎడిటర్: ఆశిక్ కుసుగొల్లి
రేటింగ్: 2.5/5
భారీగా ప్రచారం చేసి, ఒకేసారి 5-6 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోతుందా? కోట్లు ఖర్చు పెట్టి రిచ్ గా సినిమా తీస్తే పాన్ ఇండియా మూవీ అయిపోతుందా? ఇవేవీ కాదు, భాషలతో సంబంధం లేకుండా ఎమోషనల్ గా అందరికీ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే దాన్ని పాన్ ఇండియా సినిమా అంటారు. పాన్ ఇండియా అనుకొని సినిమాలు తీస్తే అవ్వవు, అన్నీ కలిసొచ్చినప్పుడు మాత్రమే ఆ అప్పీల్ వస్తుంది. ఈ లాజిక్ ను విక్రమ్ రోణ మేకర్స్ మిస్సయినట్టున్నారు.
సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్లను కట్టిపడేసే విజువల్స్ ఉన్నాయి. ఆశ్చర్యపరిచే సెట్స్ ఉన్నాయి. అందమైన ముద్దుగుమ్మ ఉంది. ఊదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉంది. కానీ.. అసలైన కథ-కథనం లేదు. కట్టిపడేసే ఎమోషన్ మచ్చుకు కూడా కనిపించదు. దీంతో విక్రాంత్ రోణ సినిమా యావరేజ్ మార్క్ దాటి హిట్ మార్క్ అందుకోలేకపోయింది.
సస్పెన్స్-థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అనూప్ భండారి. అతడు రాసుకున్న లైన్ చాలా చిన్నది. ఓ కూతురు చావుకు ప్రతీకారం తీర్చుకునే తండ్రి కథ ఇది. దీనిచుట్టూ అతడు మంచి సస్పెన్స్, డ్రామా, థ్రిల్ పెట్టాడు. అదే టైమ్ లో ప్రీ-క్లైమాక్స్ లో కూతురి పట్ల తండ్రి చూపించే ఎమోషన్ ను కూడా ఎలివేట్ చేసుంటే బాగుండేది. ఆ పని సక్రమంగా జరగలేదు ఈ సినిమాలో.
కథ విషయానికొస్తే.. కామరాట్టు అనే ఊరు. ఆ ఊరిలో ఉండే ఎస్సై హత్యకు గురవుతాడు. ఆ కేసును ఛేదించడానికి విక్రాంత్ రోణ రంగంలోకి దిగుతాడు. అయితే ఎస్సైతో పాటు పలు సందర్భాల్లో ఊరిలో చిన్న పిల్లలు కూడా హత్యకు గురయ్యారనే విషయాన్ని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పిల్లల్ని, ఎస్సైని ఎవరు చంపుతారు? వాళ్లను విక్రాంత్ పట్టుకున్నాడా లేదా? అసలు ఈ హత్యలకు, విక్రాంత్ జీవితానికి సంబంధం ఏంటి అనేది సినిమా స్టోరీ.
చెప్పాల్సిన పాయింట్ ను ఒక్కొక్కటిగా విడమర్చి చెబుతూ, ఎక్కడికక్కడ చిక్కుముడులు వేస్తూ కథను బాగానే స్టార్ట్ చేశాడు అనూప్. అయితే ఈ క్రమంలో బోర్ కొడుతుందేమో అనే సందేహం అతడికి వచ్చినట్టు లేదు. చిక్కుముడులు వేసే క్రమంలో విక్రాంత్ రోణ ఫస్టాఫ్ బోర్ కొడుతుంది. కాకపోతే ఆకట్టుకునే విజువల్స్, భారీతనం సినిమాను చూసేలా చేస్తాయి. అయినప్పటికీ అవి ఎక్కువసేపు సినిమా ఫలితాన్ని కాపడలేవు. ఇక సెకండాఫ్ లో చిక్కుముడులు విప్పే ప్రక్రియను మాత్రం చకచకా పూర్తిచేశాడు దర్శకుడు. ఈ క్రమంలో కూతురిపై ఉన్న ప్రేమను, అక్కడ పండించాల్సిన ఎమోషన్ ను వదిలేశాడు. ఇలా ఫస్టాఫ్ లో చేసిన మిస్టేక్, సెకెండాఫ్ లో చేసిన మరో పెద్ద తప్పు వల్ల విక్రాంత్ రోణ ఫలితమే మారిపోయింది.
ఈ సినిమాకు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తెగ ప్రచారం చేసింది. దీంతో ఇందులో సుదీప్ సరసన ఆమె హీరోయిన్ గా నటించిందని చాలామంది అనుకున్నారు. అలా అనుకున్న వాళ్లంతా సినిమా చూసి కంగుతింటారు. ఎందుకంటే, ఇందులో ఆమెది కేవలం ఐటెం రోల్ మాత్రమే. చదవడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. ప్రచారంలో ఓ రేంజ్ లో జాక్వెలిన్ ను వాడుకున్న మేకర్స్, సినిమాలో మాత్రం ఆమెను వాడుకోలేకపోయారు. కేవలం ఐటెంసాంగ్ చేసి పంపించేశారు. ఇంకా చెప్పాలంటే, ఈ సినిమా షూటింగ్ కంటే, ప్రమోషన్ కే జాక్వెలిన్ ఎక్కువ కాల్షీట్లు ఇచ్చినట్టుంది.
మూవీలో చెప్పుకోదగ్గ సక్సెస్ ఫాక్టర్ ఏదైనా ఉందంటే అది సుదీప్ మాత్రమే. ఈ సీనియర్ కన్నడ నటుడు పాన్ ఇండియా అప్పీల్ కోసం పరితపించాడు. అందుకే విక్రాంత్ రోణ కోసం చాలా కష్టపడ్డాడు. అతడి యాక్టింగ్, డాన్స్, ఫైట్స్ అన్నీ మెప్పిస్తాయి. ఇతడు తప్ప మిగతా నటీనటులెవ్వరూ తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అందుకే ఈ కథతో, సినిమాతో కనెక్ట్ అవ్వడం కష్టంగా మారుతుంది.
ఇక టెక్నికల్ గా చూసుకుంటే, ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్, సౌండ్ డిజైనింగ్.. ఇలా ప్రతి విషయంలో విక్రాంత్ రోణ మెప్పిస్తుంది. ఎడిటింగ్ విషయంలో మాత్రం కాస్త పూర్ గా ఉంది. 2 పాటలు తీసి అవతల పడేయొచ్చు. నిడివిని మరో 10 నిమిషాలు తగ్గించొచ్చు.
ఓవరాల్ గా విక్రాంత్ రోణ సినిమా పాన్ ఇండియా అప్పీల్ అందుకోలేకపోయింది. పూర్ రైటింగ్, కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లేతో చతికిలపడింది. రక్కమ్మ ఐటెంసాంగ్, విజువల్స్, ఆర్ట్ వర్క్ కోసం మాత్రం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.