తెలుగు రాష్ట్రాలకిది కొత్త సంవత్సరమే అయినా ఒక్కో చోటా ఒక్కో ఆచారం, ఒక్కో సాంప్రదాయం చలామణీ అవుతూ మనల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు వేరు మా వేడుకలు వేరు అంటున్నారు తెలంగాణాలోని మోత్కురు ప్రజలు. ఇక్కడ నాన్ వెజ్తో ఉగాది జరుపుకోవడం ఆనవాయితీనట.
యాదాద్రి భువనగిరి మోత్కూరు మున్సిపాలిటీలో ఉగాది వేడుకలను ప్రత్యేక తరహాలో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా షడ్రురుచుల ఉగాది పచ్చడి మాత్రమే కాదు, చాలా ప్రత్యేక ఉంది.
పచ్చడితో పాటు మందు, మాంసాలు,ముత్యాల మ్మలకు బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను నిర్వహించడం ఇక్కడి ఆనవాతీ.సుమారు వందేళ్లకు పైగా మోత్కూర్లో ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.
పూర్వం మోత్కూరులో వేసవిలో పెద్ద ఎత్తున ప్రజలకు అమ్మవారు సోకి చనిపోయేవారు. గ్రామంలో తూర్పున, పడమర కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురైనందుకే ప్రజలకు అమ్మవారు సోకి చనిపోతున్నారని గ్రామ పెద్దలు భావించారు.
దీంతో ఉగాది పర్వదినం రోజున ఊరంతా ముత్యాలమ్మలకు చలి బోనాలు చేసి, జంతుబలి ఇచ్చి అమ్మవార్లకు శాంతించినందున గ్రామంలో ఒక్కసారిగా అమ్మవారు మాయమైపోయిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. అందువల్ల ఆనాటి నుంచి నేటి వరకు ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.