కోనసీమ జిల్లా మండపేట మండలంలోని అర్తమూరు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దళితులకు స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలంటూ మృతదేహంతో పంచాయతీ కార్యాలయం ఎదుట మండుటెండలో ధర్నాకు దిగారు ఆ గ్రామ దళితులు.
గ్రామానికి చెందిన ఓ దళిత వృద్ధుడు మృతి చెందితే ఖననం చేసేందుకు జాగా లేకపోవడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రెండో రోజు కూడా అర్తమూరు పంచాయితీ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద వృద్ధుడి శవాన్ని ఉంచి అంత్య క్రియలకు స్థలం చూపించాలని డిమాండ్ చేశారు.
దళితులపై మండల స్థాయి అధికారులు వివక్షత చూపిస్తున్నారంటూ దళిత యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ర వర్ణాలకు పంచాయితీ, రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ ఎస్సీలను హేళన చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.
Advertisements
తమకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. సంబంధిత అధికారులు దిగివచ్చి దళితులకు ప్రత్యేక స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. రామచంద్రపురం మండపేట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు గ్రామస్తులు.