– పులిగుట్ట దగ్గర ఉద్రిక్తత
– మైనింగ్ ను వ్యతిరేకిస్తూ గ్రామస్తుల నిరసన
– జేసీబీ, టిప్పర్ ధ్వంసం
పులిగుట్ట మైనింగ్ పై చాలా రోజులుగా వనపర్తి జిల్లా అమడబాకుల గ్రామస్తులు పోరాడుతున్నారు. మైనింగ్ పనులు ఆపేయాలని ధర్నాలు, దీక్షలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం వేలాది మంది జనం పులిగుట్ట వద్దకు చేరుకుని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. పనులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో కాంట్రాక్టర్ రావడంతో ఆయన్ను అడ్డుకున్నారు. జేసీబీ, టిప్పర్లను ధ్వంసం చేశారు.
గ్రామస్తుల ఆందోళనకు జిల్లా బీజేపీ నాయకులు మద్దతు పలికారు. ఆందోళన కారుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పులిగుట్టపై మైనింగ్ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయేంతవరకు పోరాటం చేస్తామని అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు.
గతేడాదితో 20 ఏళ్ల మైనింగ్ లీజు పూర్తికాగా.. సబ్ లీజ్ తీసుకున్న వ్యక్తి మళ్లీ రెన్యువల్ కు దరఖాస్తు చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. లీజును రెన్యువల్ చేయవద్దని ప్రజాసంఘాలు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లగా.. ఆర్డీవో, మైనింగ్ ఏడీ ఆధ్వర్యంలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇటీవలే ఆర్డీవో, ఏడీ మైనింగ్ సైట్ కు వెళ్లి విచారణ చేశారు.
2002 నుంచి 2022 వరకు మైనింగ్ సైట్ లో సింగిల్ గ్రాము ఖనిజాన్ని కూడా తీసుకెళ్లలేదని, అలాంటి వారికి లీజు రెన్యువల్ చేసుకునేందుకు అవకాశం కల్పించడమేంటని ప్రశ్నిస్తున్నారు గ్రామస్తులు. అన్ని వర్గాలు అడ్డుకుంటున్నా.. లీజు తీసుకున్న వారు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుండటంతో ఆందోళన నెలకొంది. అనుమతులు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం అన్నిరకాలుగా ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఈ లీజు విషయంలో మొదటి నుంచీ ఆందోళనలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.