కిరణ్ అబ్బవరం. వరుస సినిమాలతో జోరుమీదున్న యువ కథానాయకుడు. ఇటీవల యంగ్ హీరో నటించిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. అన్నమాచార్యుని కీర్తనలోని భక్తిసంభరితమైన వాఖ్యాన్ని టైటిల్ గా పెట్టడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సినిమాకి కశ్మీరా కథానాయిక. కొత్త దర్శకుడు మురళీ కిషోర్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ ఆర్కే సినీఫ్లెక్స్లో అభిమానుల సమక్షంలో యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్ ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. ప్రముఖ దర్శకులు హరీశ్ శంకర్, మారుతి, నిర్మాత అల్లు అరవింద్ హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
కాగా, ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో హీరో ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 18 పేజెస్ లాంటి హిట్ చిత్రాల తర్వాత జీఏ2 పిక్చర్స్ నుంచి వస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’.
ఇదివరకే ఈ చిత్రం నుంచి ‘వాసవ సుహాస..’, ‘మనసే మనసే.. తననే కలిసే..’ అనే పాటలు విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ స్వరాలందించారు.