తమ డిమాండ్ల పరిశీలనకు క్రీడా మంత్రిత్వ శాఖ నియమించిన ఓవర్ సైట్ కమిటీ పట్ల రెజ్లర్ వినేష్ ఫొగత్ అసంతృప్తి ప్రకటించారు. ఈ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని ప్రకటించాలని ఆమె కోరారు. ఓవర్ సైట్ కమిటీ ఏర్పాటును అథ్లెట్లు హర్షించడం లేదని, మా అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని.. మా సభ్యులతో కూడిన కొత్త కమిటీని నియమించాలని ఆమె అన్నారు. ఇది మహిళా రెజ్లర్లకు సంబంధించిన సమస్య అని, చాలా సీరియస్ విషయమని వ్యాఖ్యానించిన ఆమె.. క్రీడా మంత్రిత్వ శాఖ తమ విజ్ఞప్తిని పరిశీలిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై రెజ్లర్లు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపేందుకు క్రీడా శాఖ.. బాక్సర్ మేరీ కోమ్ ఆధ్వర్యాన 5 గురు సభ్యులతో నిన్న ఓవర్ సైట్ కమిటీని నియమించింది. నెలరోజులోగా తమ నివేదికను సమర్పించాలని ఈ కమిటీకి సూచించింది.
అలాగే ఫెడరేషన్ దైనందిన వ్యవహారాలను పర్యవేక్షించాలని కూడా కోరింది. ఈ నెల రోజులూ బ్రిజ్ భూషణ్ తన విధులకు దూరంగా ఉంటారని పేర్కొంది.
అయితే ఈ కమిటీని నియమించేముందు తమను ఈ శాఖ సంప్రదించలేదని వినేష్ ఫొగత్ అన్నారు. దీన్ని ఏర్పాటు చేసేముందు మీతో చర్చిస్తామని తనకు, సాక్షి మాలిక్, బజ్ రంగ్ పునియా తదితరులకు హామీ ఇచ్చారని, కానీ ఎవరితోనూ సంప్రదించలేదని ఆమె చెప్పారు. ఈ హామీని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.