బెంగాల్ లో అసన్ సోల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా అగ్ని మిత్ర పాల్ పోటీ చేస్తు్న్నారు. నియోజక వర్గంలోని ఓ బూత్ ను పరిశీలించేందుకు వెళ్లిన తనపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆమె ఆరోపించారు.
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తనపై దాడికి దిగారని ఆమె తెలిపారు. తన కాన్వాయ్ పై వారు రాళ్లతో దాడి చేశారని చెప్పారు. పోలీసులు చూస్తుండగానే ఈ దాడి జరిగిందన్నారు. కానీ దాడి చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె వాపోయారు.
తన సెక్యూరిటీపై టీఎంఎసీ కార్యకర్తలు కర్రలతో దాడులు చేశారని తెలిపారు. ఈ ఘటనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలన్నారు. మమతా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అసన్ సోల్ బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరని పేర్కొన్నారు.
నాడియా జిల్లాలో అత్యాచార ఘటనపై మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. అత్యాచార బాధితురాలికి ప్రేమ వ్యవహారం ఉందా లేదా ఆమె గర్భవతి అని ముందు తెలుసుకోవాలని మమతా బెనర్జీ మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ఒక మహిళగా మమతా వ్యాఖ్యలకు తాను సిగ్గుపడుతున్నానని తెలిపారు.