టీమ్ ఇండియా సభ్యులు వరుస సిరీస్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏ కాస్త విరామం దొరికినా కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. తాజాగా రన్ మిషన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయాన్ని దర్శించుకున్నారు.
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా జట్టుతో కలిసి ఆయన ఇండోర్‌కు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత జట్టు సభ్యులకు కాస్త విరామం దొరికింది. ఈ క్రమంలో ఇండోర్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయిని ఆలయానికి వెళ్లారు.
ఆలయంలో విరుష్క జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలయానికి వచ్చిన భక్తులు కోహ్లీ, అనుష్కలను చూసి భక్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారితో సెల్ఫీల కోసం ఎగబడ్డారు.
కొంత కాలంగా విరాట్ ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇటీవల టెస్టుల్లో ఆయన ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాసర్కర్ ట్రోపీలో ఆయన అత్యధిక స్కోర్ 46 మాత్రమే కావడం గమనార్హం. కనీసం నాలుగో టెస్టులోనైనా విరాట్ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.