విరాట్ కోహ్లిలాంటి టాప్ క్రికెట్ ప్లేయర్ రోజూ కోట్లల్లో సంపాదిస్తాడు. అందుకు తగినట్లే ఎన్నో లగ్జరీ కార్లలో తిరగడం కూడా సహజమే. అయితే విరాట్ మాత్రం తాను ఎన్నో కార్లను కొని అమ్మేసినట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు. చేతిలో డబ్బు ఉంది కదా అని పెద్దగా ముందుచూపుతో ఆలోచించకుండా తాను కార్లు కొనేవాడినని, ఇప్పుడు వాటన్నింటినీ అమ్మేసినట్లు అతడు చెప్పాడు.
ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తన టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ ఫోటోషూట్ లో విరాట్ పాల్గొన్నాడు. అటు కెమెరాకు పోజులిస్తూనే ఇటు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఈ సందర్భంగా తన ఆరాధ్య క్రికెటర్లు, తన చిన్ననాటి సంగతులను కూడా కోహ్లి పంచుకున్నాడు. ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ ఈ ఇంటర్వ్యూను పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా తాను పెద్దగా ఆలోచించకుండా కొనుగోలు చేసిన కార్లు గురించి చెప్పాడు. “నేను వాడిన చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవే. కానీ వాటిని నేను పెద్దగా నడిపింది లేదు. కానీ ఓ సమయం వచ్చిన తర్వాత అనవసరంగా కొన్నాను అనిపించి వాటిలో చాలా వాటిని అమ్మేశాను. ఇప్పుడు మాకు కచ్చితంగా అవసరం అనిపించేవే వాడుతున్నాను. ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే పరిణతి వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశాను” అని కోహ్లి చెప్పడం విశేషం.
ఇక తన ఆరాధ్య క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, సచిన టెండూల్కర్ అని, వాళ్లు క్రికెట్ నే మార్చిన ప్లేయర్స్ అని కొనియాడాడు. 2016 ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఏకంగా నాలుగు సెంచరీలతోపాటు 973 రన్స్ చేసిన విరాట్.. ఇప్పటికీ ఆ టీమ్ లో కీలకమైన ప్లేయర్. ఆ టీమ్ బ్యాటింగ్ అతని చుట్టే తిరుగుతుంది. గత సీజన్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ఇప్పుడు మరోసారి టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి తమకు తొలి ఐపీఎల్ ట్రోఫీ అందిస్తాడని ఆర్సీబీ ఆశతో ఉంది.