టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి మరో రికార్డును బ్రేక్ చేయనున్నాడు. ఆసీస్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరల్డ్ రికార్డు సృష్టించనున్నాడు. విరాట్ కేవలం 64 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు చేసిన ఫస్ట్ క్రికెటర్ గా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. కోహ్లి ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 546 ఇన్నింగ్స్ లో 24,936 పరుగులు సాధించాడు.
సచిన్ 576 ఇన్నింగ్స్ లో 25 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొడతాడో లేదో చూడాలి. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో 25 వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
సచిన్ తన కెరీర్ లో 782 ఇన్నింగ్స్ లో 34,357 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్ లో 28,016 రన్స్ కొట్టాడు. రికీ పాంటింగ్ 688 ఇన్నింగ్స్ లో 27,483 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
మహేళ జయవర్ధనే 725 ఇన్నింగ్స్ లో 25,957 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, జాక్వస్ కలీస్ 617 ఇన్నింగ్స్ లో 25,534 ఐదో ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లి 24,936 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. దీంతో ఈ సిరీస్ లో మరో 64 పరుగులు చేస్తే.. భారత్ తరపున 25 వేల పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా విరాట్ రికార్డు సాధిస్తాడు.